టీటీడీలో ఆ ఉద్యోగులకు ఉద్వాసన

2 Nov, 2019 08:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి :  పారదర్శక పాలన.. జవాబుదారితనం, నిజాయితీతో ప్రజలకు మంచి పాలనను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక జీఓను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో పాటు కార్పొరేషన్, అటానమస్‌ బాడీలో పనిచేసే మాజీ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే వారిని తొలగిస్తూ ప్రభుత్వం గతనెల 18న జీఓ నంబర్‌ 2323 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో 60 ఏళ్ల వయసు వరకు ఉద్యోగం చేసి విరమణ పొందిన తర్వాత ప్రత్యేక ఉత్తర్వుల మేరకు వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగుల గడువు ముగిసింది. అక్టోబర్‌ 31 నాటికి ఆయా విభాగాల్లో పనిచేసే 194 మంది ఉద్యోగులను టీటీడీ తొలగించింది. యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ జీఓను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో  ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకుని కొందరు మాజీ ఉద్యోగులు టీటీడీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆ ప్రభుత్వ పెద్దలకు అవసరమైన వారిని అందలం ఎక్కించడం ఆనవాయితీగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా టీడీపీ పాలనలో అనేకమంది రిటైర్‌ అయిన అధికారులను కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిస్తూ వచ్చారు. వారికి అటెండర్, కారు, బంగ్లా సౌకర్యాలతో పాటు రూ.లక్షకు పైనే గౌరవ వేతనం ఇచ్చేవారు. పలు శాఖల్లో వారు కొనసాగారు. దీంతో కొత్తగా భర్తీ చేయాల్సిన పోస్టులు కూడా ఆగిపోయాయి. పదవీ విరమణ పొందిన వారిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించడం కారణంగా టీటీడీ రెగ్యులర్‌ ఉద్యోగులు కొందరు పదోన్నతులు కోల్పోయారనే ప్రచారం ఉంది. కొత్త ఉద్యోగాల నియామకాలకు ఈ పరిణామం అడ్డంకిగా మారింది. దీనిపై ఉద్యోగ సంఘాలు తెల్ల ఏనుగులను సాగనంపండి అంటూ పలుమార్లు ఆందోళనలు చేశాయి. పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పాత సంప్రదాయాలకు స్వస్తి పలికారు. జీఓ 2323 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో 60 సంవత్సరాలు పైబడి పదవీ విరమణ పొంది.. తిరిగి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి టీటీడీ ఉద్వాసన పలికింది. అక్టోబర్‌ 31లోపు టీటీడీలో ఏయే శాఖలో ఎవరెవరు పనిచేస్తున్నారో గుర్తించాలని ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు జేఇఓ బసంతకుమార్‌ ఇటీవల నోటీసులు జారీ చేశారు. టీటీడీలోని అన్ని విభాగాల హెచ్‌ఓడీల నుంచి నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా టీటీడీలో పనిచేస్తున్న 194 మందిని తొలగించినట్లు జేఈఓ బసంత్‌కుమార్‌ వెల్లడించారు.  

వారిని తొలగించాం 
ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలులో భాగంగా టీటీడీలో పనిచేస్తున్న 194 మందిని తొలగించాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 59 మంది హెచ్‌ఓడీల నుంచి నివేదిక కోరాం. అందులో 22 మంది హెచ్‌ఓడీల పరిధిలో ఉన్నవారు మాత్రం 194 మంది. 34 మంది హెచ్‌ఓడీల పరిధిలో ‘నిల్‌’ రిపోర్ట్‌ వచ్చింది. మరో ముగ్గురు హెచ్‌ఓడీల నుంచి నివేదిక రావాల్సి ఉంది.   
–బసంత్‌కుమార్, టీటీడీ జేఈఓ, తిరుపతి    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా