ఎల్‌జీ పాలిమర్స్‌కు ఎన్‌వోసీ ఇవ్వలేదు

4 Jun, 2020 04:36 IST|Sakshi

కంపెనీని సీజ్‌ చేశాం.. 

డైరెక్టర్లపై కేసు పెట్టాం

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సమయంలో కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ఎల్‌జీ పాలిమర్స్‌కు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చామనడం శుద్ధ అబద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. లాక్‌డౌన్‌ 3.0 మార్గదర్శకాల ప్రకారం.. కేంద్రం పలు సడలింపులు ఇచ్చిందని, దీని ప్రకారం తమ పరిశ్రమ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినివ్వాలని ఎల్‌జీ పాలిమర్స్‌ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకుందని వివరించింది. అనుమతి కావాలంటే పరిశ్రమ కంటైన్‌మెంట్, బఫర్‌ జోన్‌లో లేదని డిక్లరేషన్‌ ఇవ్వాలని ఎల్‌జీ పాలిమర్స్‌కు చెప్పామని, అయితే ఆ కంపెనీ డిక్లరేషన్‌ను సమర్పించలేదంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇప్పటికే కంపెనీ నిర్వహణ, ఉత్పత్తికి అనుమతిని ఉపసంహరించిందని వివరించింది.

విశాఖపట్నంలో మే 7న ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరీన్‌ విషవాయువు విడుదలై 12 మంది మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదే ఘటనపై మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల వన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. స్టైరీన్‌ వాయువు కాదని, అది ద్రావణమని, ట్యాంక్‌లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్లే స్టైరీన్‌ లీకైందని వలవన్‌ వివరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమీప గ్రామాల ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్నారు. మృతులకు భారీ నష్టపరిహారం, ఇతరులకు వైద్య సాయం, పరిహారం అందించామన్నారు.

ప్రాణ నష్టానికి ఎల్‌జీ పాలిమర్స్‌దే బాధ్యత : ఎన్జీటీ
విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ప్రాణ నష్టానికి çపూర్తి బాధ్యత ఎల్‌జీ పాలిమర్స్‌దేనని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ప్లాంటు నడిపించారని, 1989 నాటి పర్యావరణ అనుమతులను కూడా కంపెనీ ఉల్లంఘించిందని బుధవారం నాటి రాతపూర్వక ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక స్టైరీన్‌ గ్యాస్‌ నిల్వలను కంపెనీ సరైన రీతిలో నిర్వహించలేకపోయినట్టు తెలిపిం దని వివరించింది.  కంపెనీ  జమ చేసిన రూ.50 కోట్లను బాధితులకు నష్టపరిహారంగా, పర్యా వరణ పునరుద్ధరణకు వెచ్చించాలని తెలిపింది. 

>
మరిన్ని వార్తలు