ఆ ఉత్తర్వులు.. పరస్పర విరుద్ధం

1 Apr, 2020 03:39 IST|Sakshi

నేషనల్‌ ప్రొటోకాల్‌ పాటించేలా అనుమతించండి

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపిన బెంచ్‌  

సాక్షి, అమరావతి:  రాష్ట్ర సరిహద్దుల వద్ద నిరీక్షిస్తున్న పౌరులు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించడంపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్‌లో నివేదించింది. తొలుత ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రెండో కేసులో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున వీటిని వెనక్కి తీసుకుని నేషనల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం నడుచుకునేలా అనుమతించాలని అభ్యర్థించింది.

రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. వారి నివాసాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్, కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ బి.కృష్ణమోహన్‌తోపాటు పిటిషనర్‌ తరఫు న్యాయవాది కూడా మొబైల్‌ ఫోన్ల నుంచే వాదనలు వినిపించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను విచారించడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. 

అది నేషనల్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధం...
రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉన్నవారిని అనుమతించే విషయంలో నేషనల్‌ ప్రొటోకాల్‌ ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సుమోటోగా విచారణ జరిపిన వ్యాజ్యంలో ఈనెల 26న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిందని ఏజీ శ్రీరామ్‌ న్యాయస్థానానికి నివేదించారు. అయితే అదే రోజు బీజేపీ నేత ఒకరు దాఖలు చేసిన వ్యాజ్యంలో నేషనల్‌ ప్రొటోకాల్‌ ప్రస్తావన లేకుండానే అరోగ్యంగా ఉన్న వారందరినీ రాష్ట్రంలోకి అనుమతించాలని ఇదే ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది నేషనల్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధమని, అందువల్ల రెండో కేసులో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

హైకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు...
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు హైకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జూమ్‌ క్లౌడ్‌ మీటింగ్‌ యాప్‌ ద్వారా కేసుల విచారణలో గొంతు, దృశ్యాల స్పష్టత బాగుండటంపై సీజే సంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు