అంతా సెట్‌ చేశారు..

7 Aug, 2017 02:30 IST|Sakshi
అంతా సెట్‌ చేశారు..
- 3 కోట్ల బాక్సుల ఏర్పాటుకు రంగం సిద్ధం 
మామూలు సెట్‌టాప్‌ బాక్స్‌ ధర రూ.1,500 
కానీ రూ.4 వేలుగా ధర నిర్ణయించిన ప్రభుత్వం
 
సాక్షి, అమరావతి: సర్కారు వారి సెట్‌ టాప్‌ బాక్స్‌ల వ్యవహారం చూస్తుంటే ‘చారాణా ముర్గీకో బారాణా మసాలా’ అన్న సామెత గుర్తొస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం టీవీలున్న వారి ఇళ్లలో 90 శాతం సెట్‌ టాప్‌ బాక్స్‌లు ఉన్నాయి. ఇప్పటికే రూ.1,500 వెచ్చించి ఆ బాక్స్‌ను కొనుగోలు చేశారు. ఈ స్థితిలో ప్రభుత్వం ఏపీ ఫైబర్‌ నెట్‌ అంటూ.. టీవీ, టెలిఫోన్, ఇంటర్‌నెట్‌లను ఒకే కనెక్షన్‌ ద్వారా ఇస్తామని ఊదరగొడుతూ ముందుకొచ్చింది. ఇందుకోసం ఏర్పాటు చేసే సెట్‌ టాప్‌ బాక్స్‌ కోసం రూ.4 వేలు చెల్లించాలంటోంది.

ఇంత సొమ్మును పేద వర్గాల వారు చెల్లించడం ఇప్పటికిప్పుడు అసాధ్యం. ఈ సాకుతో వారిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ.. రుణ సదుపాయం కల్పిస్తామంటోంది. దీని వెనుక ఉన్న మర్మం.. కిటుకు అంతా ఇక్కడే ఉంది. జనానికందరికీ బ్యాంకుల ద్వారా అప్పులిప్పించాలి.. ఆ సొమ్ములో వేలకోట్లు దండుకోవాలి.. జనం మాత్రం వడ్డీ సహా బ్యాంకులకు అప్పులు చెల్లించాలి.. ఇదే అసలు పథకం!! దీంతోపాటు ప్రసారాలను నియంత్రించే ‘కీ’ని ప్రభుత్వం తమ చేతిలో పెట్టుకుంటుంది. తాను తలచిందే నిజమని జనానికి చూపించనుంది. ఆందోళన కలిగించే కొత్తతరహా బాదుడు కథాకమామిషూ ఇది..
 
అయినవారికే కాంట్రాక్టులు: వాస్తవానికి సెట్‌ టాప్‌ బాక్సుల కుంభకోణం ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుతోనే మొదలైంది. ముఖ్యమంత్రి సమీప బంధువుకు చెందిన ముఖ్యమంత్రి  సమీప బంధువుకు చెందిన టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. ఇందులోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కరెంట్‌ స్తంభాలను ఉపయోగించుకుని 23,500 కి.మీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేశారు. సెట్‌ టాప్‌ బాక్స్‌లను ఉపయోగించి టీవీ, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌ అందించే పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ బాక్సులను చైనా తయారు చేస్తోంది.  సెట్‌టాప్‌ బాక్సులను అందించేందుకు చైనా కంపెనీల ప్రతిపాదనలపై చర్చలు జరుగుతుండగానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను అమర్‌ రాజా, యాగా టెక్నాలజీ ప్రతినిధులు కలిశారు.

 అమర్‌ రాజా సంస్థ చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతది. యాగా టెక్నాలజీ సంస్థ కూడా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన అధికార పార్టీ నేతది. ఈ రెండు సంస్థలకే సెట్‌ టాప్‌ బాక్సుల కాంట్రాక్టు అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ రెండు సంస్థలు సెట్‌టాప్‌ బాక్సులను తయారుచేయవు. చైనా నుంచి విడి భాగాలు తెప్పించి వాటిని అసెంబుల్‌ (విడిభాగాల కూర్పు) చేస్తాయి. విడి భాగాలపై ఎలాంటి పన్నులూ ఉండవు. అలాంటపుడు బాక్సు ధర రూ. 2వేలను మించే అవకాశమే లేదు. కానీ రూ. 4వేలకు అంటగట్టడానికి ప్రభుత్వం సిద్ధపడడం వెనుక దాదాపు రూ. వెయ్యి కోట్లు చేతులు మారినట్లు వినిపిస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సాధారణంగా టెండర్లు పిలిచి తక్కువ కోట్‌ చేసే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం సహజం. 
 
కానీ, సెట్‌టాప్‌ బాక్సుల సరఫరా కాంట్రాక్టు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలను పట్టించుకోలేదు. పైగా అమర్‌రాజా, యాగా టెక్నాలజీలకు సెట్‌ టాప్‌ బాక్సుల తయారీపై అవగాహన లేదు. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించే నిపుణులూ లేరు. అయినా, అయినవారు కాబట్టి వారికే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సెట్‌ టాప్‌ బాక్సులకు ఇప్పటికిపుడు రూ.4 వేలు చెల్లించడానికి వినియోగదారులు సిద్ధంగా లేరు. 
 
ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ ఫైబర్‌ కనెక్షన్లు...
ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ స్కూల్స్‌తోపాటు సీబీఎస్‌ఈ స్కూల్స్‌కు ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా సీసీటీవీ సర్వైలెన్స్‌ వ్యవస్థ, వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ వ్యవస్థ, ప్రభుత్వ డ్రోన్స్‌ వ్యవస్థ, ఏపీ టవర్స్‌ లిమిటెడ్, ఏపీ స్టేట్‌ డేటా సెంటర్, పబ్లిక్‌ వైఫై వ్యవస్థ పనిచేయనున్నాయి. ప్రభుత్వ సర్వీసులను, ప్రభుత్వం చెబుతున్న విషయాలను ఈ వ్యవస్థల ద్వారా ప్రతి ఇంటికి చేరవేయడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. అన్ని వర్సిటీలు, స్వయం ప్రతిపత్తిగల కాలేజీల ప్రాంగణాలకు కూడా వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జిల్లాకో నోడల్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
రూ. 4,500 కోట్ల కుంభకోణం ఇది..
ఇంట్లో కేబుల్‌ టీవీకి సెట్‌టాప్‌ బాక్స్‌ పెట్టాలంటే రూ.1,500 ఖర్చవుతుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రూ.4 వేలకు కొనాలంటోంది. ఇంత ఖర్చు దేనికంటే.. హెచ్‌డీ క్వాలిటీతో టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్‌ వస్తాయంటోంది. ఇవి రావడానికి బాక్సులో ర్యామ్‌తోపాటు కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు మారిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. దీనికి మహా అయితే ఇంకో రూ.వెయ్యి ఖర్చువుతుందని చెబుతున్నారు. సెట్‌టాప్‌ బాక్సును ప్రభుత్వం రూ.4 వేలకు అంటగట్టాలనుకోవడంతో వినియోగదారుడు అదనంగా రూ.1,500 చెల్లిస్తాడన్నమాట. రాష్ట్రంలో 3కోట్ల కేబుల్‌ కనెక్షన్లున్నాయి. వీటన్నిటికీ బాక్సులను అంటగడితే రూ.12వేల కోట్లు వస్తాయి. అందులో వాస్తవంగా ఖర్చులు పోగా వినియోగదారుల నుంచి అదనంగా రాబట్టే రూ.4,500 కోట్లు కమీషన్ల రూపంలో చేతులు మారబోతున్నాయి. ఈ ప్రాజెక్టును అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల కంపెనీలకు అప్పగించారు. అంటే జనం నుంచి రాబట్టే అదనపు సొమ్మంతా ఈ రెండు కంపెనీలకు.. అక్కడి నుంచి సర్కారు పెద్దలకు చేరబోతోంది.
 
సర్కారు గుప్పిట్లో ప్రసారాలు 
విద్య, వైద్యం వంటి ముఖ్యమైన రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ కేబుల్‌ ఆపరేటర్లు చేయాల్సిన పనిని నెత్తికెత్తుకోవడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 79% జనాభాకు టెలిఫోన్‌ సౌకర్యం, 87% మందికి సెల్‌ఫోన్, 27% మందికి ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. అలాగే రాష్ట్రంలో 80% ఇళ్లలో టీవీలకు సెట్‌ టాప్‌ బాక్సులతో కేబుల్‌ నెట్‌ వర్క్‌ కనెక్షన్లు ఉన్నాయి. అయినా కొత్తగా రాష్ట్రంలోని ఇళ్లకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్‌తో సెట్‌టాప్‌ బాక్సులను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.

ఫైబర్‌ నెట్‌ వర్క్‌ కనెక్షన్‌తోపాటు సెట్‌టాప్‌ బాక్సులను అమర్చుకుంటే ప్రజలు ఇక సర్కారు చూపించే సినిమాలు, వార్తలే చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తోంది. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ వర్క్, సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు పూనుకుందని అంటున్నారు. తొలి దశలో పది లక్షల సెట్‌టాప్‌ బాక్సులను మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్ల (ఎంఎస్‌ఓల) ద్వారా ఇళ్లకు పంపిణీ చేయించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం రూ. 400 కోట్లు సమీకరించి సెట్‌ టాప్‌ బాక్సుల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలకు అందించింది. రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 200 కోట్లను, అలాగే బ్యాంకు నుంచి మరో రూ. 200 కోట్లలను రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి సమీకరించింది.

మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెట్‌టాప్‌ బాక్సులను వినియోగదారులకు పంపిణీ చేయడానికి ఎంఎస్‌ఓలు విముఖత చూపుతున్నారు. మొత్తం కేబుల్‌ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవడానికే ఈ సెట్‌టాప్‌ బాక్సులను తెరపైకి తెచ్చిందని ఎంఎస్‌ఓలు ఆందోళన చెందుతున్నారు. ఈ సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పాటు చేసుకున్న వారికి ప్రసారం చేసే నిమిత్తం ఫైబర్‌ నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌.. 5,000 దక్షిణాది, 1,600 హిందీ, 500 ఇంగ్లీషు సినిమాలపై 3 ఒప్పందాలను చేసుకుంది. 4,000 స్కూల్స్, 6,896 పంచాయతీ కార్యాలయాలకు ఫైబర్‌నెట్‌ వర్క్‌ కనెక్షన్లను  ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. 
మరిన్ని వార్తలు