బిల్లుల భరోసా..

23 Jul, 2019 09:15 IST|Sakshi
బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్ణయాలు

బడుగు, బలహీన వర్గాలకు నామినేటెడ్‌ పనుల్లో సగం కేటాయింపు

శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు

సాక్షి, విజయనగరం గంటస్తంభం: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సామాజిక భరోసా కల్పిస్తోంది. చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందుతోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ఏకంగా చట్టరూపం తీసుకొచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకుంటోంది. శాసనసభలో నాలుగు కీలక బిల్లులకు సోమవారం ఆమోదం తెలిపింది. ఆయా బిల్లులతో రానున్న రోజుల్లో జిల్లాలోని బడుగుబలహీన వర్గాల ప్రజలు, మహిళలు, యువతకు అధిక ప్రయోజనం కలగనుంది. సామాజిక భరోసా లభించనుంది.

యువత ఉపాధికి భరోసా.. 
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయిస్తూ శాసనసభలో ఒక కీలక బిల్లుకు ఆమోదముద్ర పడింది. దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి బిల్లు పెట్టకపోవడం విశేషం. ఈ బిల్లు ఆమోదంతో జిల్లాలో నిరుద్యోగ యువత జీవితాలకు భరోసా కలగనుంది. జిల్లాలో ప్రస్తుతం 43 భారీ, మధ్యతరహా, సుమారు 4500 వేలు చిన్నతరహా, మైక్రో పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 2.20 లక్షల మందికి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, స్థానికులతో ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యాలు 10 నుంచి 20 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించి మిగిలినవి ఇతర ప్రాంతాల వారీతో భర్తీ చేస్తున్నాయి.

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు 1.65 లక్షల మందికి లబ్ధి
నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50శాతం సుమారు 13 లక్షల మందికి
నామినేటెడ్‌ పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50శాతం 16.80 లక్షల మందికి
శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు వల్ల 14 లక్షల మందికి లబ్ధి

దీంతో ఉపాధి కోసం జిల్లా యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తోంది. తాజా బిల్లువల్ల లక్షా 65వేల ఉద్యోగాలు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లాలో ఇప్పటికే 32 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెబతుండడంతో అందులో కూడా ఉద్యోగవకాశాలు దక్కితే రానున్న ఐదేళ్లలో కొలువులు జాతర రానుంది. యువత ఆర్థికంగా స్థిరపడే రోజులు కనిపిస్తున్నాయి. దీంతో యువత ఆనందం వ్యక్తం చేస్తోంది.

పదవుల్లో మహిళా లోకం..
పనులకు, ఉద్యోగాల్లో ముందుంటున్న మహిళలు పదవుల్లో మాత్రం కాస్తా వెనుకబడి ఉంటున్నారు. రాజ్యాంగపరంగా సక్రమించిన స్థానిక సంస్థలు పదవుల్లో మాత్రమే వారికి 33 శాతం రిజర్వేషన్లు ఉండడంతో ఆయా పదవులు వారికి దక్కుతున్న విషయం తెలిసిందే. ఇకపై నామినేటెడ్‌ పదవుల్లో కూడా వారి హవా కొనసాగనుంది. జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న వారికి ఇకపై 33శాతం కాకుండా ఏకంగా 50 శాతం పదవులు దక్కనున్నాయి.

ప్రభుత్వం ఈ మేరకు ఏకంగా సోమవారం బిల్లు ఆమోదించడంతో జిల్లా మహిళలకు పదవీయోగం పట్టనుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో చూస్తే దేవాలయాలకు చైర్మన్లు, వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, వివిధ సంఘాల చైర్మన్లు, ఇతర పోస్టులు ఉన్నాయి. నామినేటెడ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తే సుమారు వేయి వరకు ఉంటాయని అంచనా. ఇందులో సగం వరకు మహిళలకు దక్కనున్నాయి. దీంతో సామాజికంగా, రాజకీయంగా వారి పాత్ర పెరగనుంది.

బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక తోడ్పాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను ఆర్థికంగా స్థితిమంతులు చేసే గొప్ప ఆలోచనకు ప్రభుత్వం చట్టరూపం ఇచ్చింది. ఆయా వర్గాలకు నామినేటెడ్‌ పనుల్లో 50శాతం పనులు వారికే దక్కనున్నాయి. దీంతో జిల్లాలో జరిగే ప్రతి రెండు నామినేటెడ్‌ పనుల్లో ఒకటి వారికి దక్కనుంది. జిల్లాలో జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, ఇతర పథకాల కింద ఏటా తక్కువులో తక్కువ 2వేల కోట్ల రూపాయలు వరకు పనులు నామినేషన్‌ పద్ధతిపై జరుగుతున్నాయి. ఇందులో రూ.1000 కోట్లు వరకు ఆయా వర్గాలకు దక్కుతాయి. పనులు చేయడం వల్ల వారికి సామాజిక హోదా పెరగడమే కాకుండా ఆర్ధికంగా ఎంతోకొంత బాగుపడతారు. జిల్లాలో 70శాతం జనాభా ఆయా వర్గాలు వారు ఉన్నారు. వీరికి ఆర్థిక భరోసా కలగనుంది.

శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటుతో... 
వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం గొప్ప వరం ప్రకటించినట్లే. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. దీంతో వారి సమస్యలు పరిష్కారానికి వేదిక దొరికినట్‌లైంది. బీసీలకు ఏదైనా సమస్యలు వచ్చినా, ఏవైనా ప్రయోజనాలు కావాలన్నా కమిషన్‌ వేయాలని కోరడం, ప్రభుత్వం వెంటనే వేయడం, లేకుంటే తాత్సారం చేయడం జరుగుతోంది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమైతే కమిషన్‌ జోలికి కూడా పోదు. అయితే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీసీలు శ్రేయస్సు ఆలోచించి ఏకంగా శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేసింది. దీంతో వారి సంక్షేమం కోసం ఆ కమిషన్‌ నిత్యం పని చేస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న సుమారు 14 లక్షల బీసీ జనాభాకు భరోసా, భద్రత కలగనుంది. 

బీసీలకు పెద్దపీట
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. మంత్రి పదవులు, బడ్జెట్‌లో కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పించింది. నేడు శాశ్వత బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుతో బీసీలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. 
– ముద్దాడ మధు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం

మరిన్ని వార్తలు