విశాఖ కేంద్రంగా డిజిటల్‌ విప్లవం

17 Mar, 2020 07:38 IST|Sakshi

మెట్రోలకు దీటుగా నగరంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగం 

ఐటీ, ఐటీయేతర రంగాలకు పెద్దపీట 

వేలాది మందికి ఉద్యోగావకాశాలు 

ఐటీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

విశాఖపట్నం: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధాని ప్రకటన తరువాత ప్రముఖ ఐటీ కంపెనీల చూపు గ్రేటర్‌ విశాఖపై పడింది. ఐటీతో పాటు ఐటీయేతర రంగానికి వేదికయ్యేందుకు సిటీ ఆఫ్‌ డెస్టినీ వడివడిగా అడుగులేస్తోంది. మెట్రో నగరాలకు దీటుగా డిజిటల్‌ మార్కెటింగ్‌ విప్లవానికి కేంద్రంగా నిలవనుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం ఏర్పడనుంది. రాష్ట్రంలోనే డిజిటల్‌ మార్కెటింగ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలకు విశాఖ వేదిక కానుంది. ఇప్పటి వరకు ఐటీ, ఐటీయేతర రంగాలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లు కేంద్రంగా ఏర్పాటవుతున్నాయి. ఆర్థిక రంగ అభివృద్ధికి ఈ సంస్థలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.  

మానవ వనరులను తీర్చిదిద్దే పనిలో.. 
వాస్తవానికి విశాఖలో ఐటీ రంగ పురోభివృద్ధికి అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం జిల్లాకు శాపంగా పరిణమించింది. తాజాగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశ్రామిక నగరంగా పేరుపొందిన విశాఖను ఐటీ హబ్‌గా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విశాఖ వేదికగా పెట్టుబడులు పెట్టాలని అనేక బహుళ జాతి ఐటీ, ఐటీయేతర సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఉత్పాదక పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో పాటు దేశానికే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ఐటీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తోంది.

అయితే స్థానికంగా ఐటీ నిపుణుల కొరత ఉండే అవకాశం ఉండడంతో ముందుగా అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు, మరోవైపు ప్రభుత్వానికి కూడా డిజిటల్‌ మార్కెటింగ్‌ చుక్కానిలా కనిపిస్తోంది. మానవ వనరులు లేని కారణంగా విశాఖ నుంచి విప్రో వంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా అనేక ఐటీ సంస్థలకు అవసరమైన మానవ వనరులను విశాఖ ద్వారా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆన్‌లైన్‌ ద్వారానే వ్యాపారాలు.. 
ప్రపంచంలో నిన్న మొన్నటి వరకు పర్సన్‌ టు పర్సన్‌ మార్కెటింగ్‌ జరిగేది. వినియోగదారులే మార్కెట్‌కి వెళ్లి తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇపుడు అంతా డిజిటల్‌ మార్కెటింగ్‌ విప్లవం పుంజుకుంది. అంతా ఆన్‌లైన్‌ ద్వారానే వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. చాలా వరకు డిజిటల్‌ ప్లాట్‌ఫారంలో ఉంటున్న వినియోగదారుల వద్దకే వస్తువులు, ఉత్పత్తులను తీసుకువెళ్లే సౌకర్యం ఏర్పడింది. ఈ మార్కెటింగ్‌ నైపుణ్యం ఉన్న వారు ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నారని సంస్థలు పేర్కొంటున్నాయి.

నిరుద్యోగులకు ఉపాధి.. 
డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రతి ఏటా బయటకు వస్తున్నారు. వీరు ఉపాధి, విద్యావకాశాల కోసం మెట్రో నగరాలకు వలస Ðవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విశాఖలో డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అందుకు అనుగుణంగా డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో విద్యార్థులను నిపుణులుగా తయారు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ విద్యార్థులను మార్కెటింగ్‌ నిపుణులుగా తీర్చిదిద్దవచ్చని భావిస్తోంది.  

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ.. 
డిజిటల్‌ మార్కెటింగ్‌లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 550 డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఆన్‌లై¯న్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా నేరుగా ప్రత్యేక ట్రైనర్‌ ద్వారా విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ అందిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇన్ఫోసిస్, విప్రో, టెక్‌మహీంద్ర, ఇతర ప్రముఖ కంపెనీల్లో ప్లేస్‌మెంట్లు సైతం లభించాయి.  

భవిష్యత్తు ‘డిజిటల్‌’పైనే  ఆధారం.. 
ఈ రంగంలో వాస్తవానికి కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఒకరికొకరికి సంబంధం ఉండదు. తెలియాల్సిన, నేరుగా కలవాల్సిన అవసరం లేదు. అయితే వారి మధ్య అనుసంధానకర్తగా ఆన్‌లైన్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ చేసే వాళ్లదే కీలక పాత్ర. భవిష్యత్తు వ్యాపారం మొత్తం డిజిటల్‌ ప్లాట్‌ఫారంపైనే జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  

డిజిటల్‌ రంగంలో విద్యార్థులకు శిక్షణ 
డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న సుమారు 550 డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌ తరగతులు నిర్వహించాం. రిమోట్‌ ప్రాంతాల్లో సుమారు 220 డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులను సది్వనియోగం చేసుకోలేకపోవడంతో మూడు నెలల కిందట ఆఫ్‌లైన్‌ తరగతులను సైతం ప్రారంభించాం. ప్రత్యేక ట్రైనర్‌ నేరుగా కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో అనేక మందికి బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి. 
– చల్లా మధుసూదనరెడ్డి, చైర్మన్, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  
  
25 వేల మందికి ఉద్యోగావకాశాలు 
ఇప్పటికే పల్సస్‌ ఆధ్వర్యంలో నగరంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటైంది. దీని ద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు కలి్పంచే అవకాశం ఉంది. ఈ ప్రొగ్రాంకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా సహకారం కూడా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రతి ఏటా 25 వేల మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయి బయటకు వస్తున్నారు. వీరిలో ఎంసీఏ, ఎంబీఏ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చేసిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో నైపుణాభివృద్ధి íశిక్షణ అందించగలిగితే స్థానికంగా ఉద్యోగాలు కలి్పంచవచ్చు. అందుకే ఇక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేశాం. ఇక్కడే చదవి, ఇక్కడే ఉంటూ నైపుణ్య శిక్షణ తీసుకొని, ఎక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీలకు ఇక్కడి నుంచే ఉద్యోగ సేవలు అందించే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం. 
– డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు, పల్సస్‌ ఐటీ కంపెనీ అధినేత   

మరిన్ని వార్తలు