కార్పొరేషన్‌లకు జవసత్వాలు 

27 Oct, 2019 03:53 IST|Sakshi

జనాభాను బట్టి నిధుల కేటాయింపు 

పాలకవర్గ సభ్యులే బాధ్యత వహించేలా చర్యలు  

మరిన్ని కార్పొరేషన్‌ల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు 

సాక్షి, అమరావతి: వివిధ వర్గాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లకు జవసత్వాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి నిధుల కేటాయింపులను కూడా ఆయా వర్గాల జనాభాను దృష్టిలో పెట్టుకుని చేయనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, కాపు, ఈబీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌లకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించింది. కాపు కార్పొరేషన్‌కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేల కోట్లు ఇచ్చింది. ఈ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు ఇచ్చే అధికారం వాటి మేనేజింగ్‌ డైరెక్టర్లకు ఉంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి వారికి రుణాలను అందించడం వరకు మండల పరిషత్‌లు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కార్పొరేషన్‌లు సహాయం తీసుకుంటాయి. ప్రస్తుతం 48 కార్పొరేషన్‌లు ఉన్నాయి. గతంలో ఉన్న 11 బీసీ ఫెడరేషన్‌లను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌లుగా మార్చింది.

కొత్తగా కులాల వారీగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌లలో ఆయా కులాల వారు సభ్యులుగా చేరాల్సి ఉంటుంది. ఆ సభ్యులకే సబ్సిడీ రుణాలు ఇస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, కాపు, ఈబీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌ల్లో ఆయా వర్గాలకు చెందినవారు సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం బీసీ కులాలకు మొత్తం 29 కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కులాల వారీగా జనాభా వివరాలు సేకరించింది. ఇప్పటివరకు కొత్తగా 16 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసింది.  

మిగిలిన కార్పొరేషన్‌లకు ప్రతిపాదనలు.. 
మిగిలిన కార్పొరేషన్‌లకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. రాష్ట్రంలో వెయ్యి జనాభాలోపు చాలా కులాలున్నాయి. వీళ్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉండదని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తేనున్నారు. ఇక నుంచి ఏర్పాటు చేసే కార్పొరేషన్‌లను సహకార చట్టం కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పాలకవర్గ సభ్యులపై మరిన్ని బాధ్యతలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందులా అలవెన్స్‌లు తీసుకుంటూ ఆషామాషీగా పనిచేస్తే కుదరదు. ప్రతి సమావేశంలోనూ సరైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలి. కార్పొరేషన్‌ల ద్వారా ఆయా వర్గాల సంక్షేమానికి నూతన విధానాలు అమలు చేయాలి.    

మరిన్ని వార్తలు