ఖర్చులు తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు

8 Dec, 2019 09:17 IST|Sakshi
విద్యుత్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన డీసీ విద్యుత్‌ చార్జింగ్‌ సెంటర్‌లో చార్జింగ్‌ చేసుకుంటున్న ఎలక్ట్రిక్‌ కారు

కార్పొరేషన్‌ అధికారులకు 15 ఎలక్ట్రిక్‌ వాహనాల కేటాయింపు 

గతంలో ప్రతి నెలా రూ.5.40 లక్షల అద్దె చెల్లింపులు 

అనవసర ఖర్చులు తగ్గించే దిశగా అడుగులు 

ప్రతి నెలా ఒక్కో కారుకు రూ.20 వేలు ఈఎంఐ చెల్లింపు 

ఆరేళ్లలో కారు కార్పొరేషన్‌ సొంతం

వాతావరణ కాలుష్యం, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్‌ (ఈ–కార్లు) కార్లు ఎంతో ఉపయోగపడుతాయి. మార్కెట్లోకి ప్రవేశించిన ఈ–కార్ల వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మొదటగా ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగాన్ని ప్రభుత్వ శాఖల నుంచే ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, మరమ్మతులు తక్కువగా ఉంటోంది. జిల్లాలో తొలుత ఏడాది కిందటే ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు ఈ–కార్లను వినియోగంలోకి తీసుకోవడంతో తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ కూడా వీటిని వినియోగిస్తోంది. కార్ల వినియోగంలో వ్యయం లెక్కిస్తే కిలో మీటరుకు కేవలం ఒక్క రూపాయి లోపలే ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇప్పటికే విద్యుత్‌ శాఖ జిల్లా విద్యుత్‌ భవన్‌లో, జిల్లాలోని పలు సబ్‌ స్టేషన్లలో చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థ తమ కార్యాలయంలో చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది.  

సాక్షి, నెల్లూరు సిటీ:  కాలుష్య నివారణ.. ఇంధనం పొదుపు.. ప్రభుత్వ నిధుల అనవసర ఖర్చులు.. లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయ అధికారులకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కార్పొరేషన్‌లోని పలు విభాగాల అధికారులకు ప్రైవేట్‌ కార్లను అద్దెకు వినియోగించుకునే వారు. ఇందుకు నెలకు రూ.5.40 లక్షల అద్దె చెల్లించే పరిస్థితి. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌మూర్తి అనవసర ఖర్చులు తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. అద్దె కార్ల స్థానంలో ఆయా విభాగాల అధికారులకు 15 ఎలక్ట్రిక్‌ కార్లను రుణసదుపాయంతో కొనుగోలు చేశారు. నెలకు ఒక కారుకు రూ.20 ఈఎంఐ చెల్లింపులతో ఆరేళ్లలో కారుకార్పొరేషన్‌ సొంతం అవుతుంది.


కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎలక్ట్రిక్‌ కార్లు 
రూ.105తో 80 కి.మీ. ప్రయాణం
ఎలక్ట్రిక్‌ వాహనాలకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎనిమిది పాయింట్లలో 7 గంటల్లో 100 శాతం చార్జింగ్‌ వచ్చేందుకు, రెండు పాయింట్లలో 2 గంటల్లో చార్జింగ్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అధికారులు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో తిరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఒకసారి చార్జింగ్‌ చేశాక దాదాపు ఏసీ ఆన్‌ చేసినా 80 కి.మీ. వరకు ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. ప్రతి రోజూ ఒక కారుకు రూ.105 ఖర్చుతో చార్జింగ్‌ చేయగా 80 కి.మీ. వరకు వస్తుంది. దీంతో కార్పొరేషన్‌కు ఖర్చులు తగ్గాయి.
 
రూ.5.40 లక్షల ఖర్చుకు ఫుల్‌స్టాప్‌
నగర పాలక సంస్థ కార్యాలయంలోని అధికారులకు కార్లు బాడుగకు ప్రతి నెలా రూ.5.40 లక్షలు చెల్లిస్తున్నారు. కమిషనర్, ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ, అడిషనల్‌ కమిషనర్‌ కార్లకు రూ.45 వేలు చొప్పున రూ.1.35 లక్షలు, ఇంజినీరింగ్‌ విభాగంలోని ముగ్గురు ఈఈలు, డిప్యూటీ కమిషనర్, టౌన్‌ప్లానింగ్‌ అధికారి, ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్‌లు, సెక్రటరీ, ఎగ్జామినర్, ఎంహెచ్‌ఓ అధికారులకు రూ.35 వేలు చొప్పున రూ.3.45 లక్షలు చెల్లిస్తున్నారు. మేయర్‌ కారుకు రూ.60 వేలు చెల్లించారు. ఇలా ప్రతి నెలా రూ.5.40 లక్షలు కార్లు బాడుగలకు చెల్లించారు. అయితే వీరిలో కొందరు అధికారులు సొంత కార్లను వినియోగిస్తూ బాడుగ డబ్బులను వారే తీసుకునేవారు. ఈ పరిస్థితికి చెక్‌ పడింది. 

ఆరేళ్లలో కార్లు కార్పొరేషన్‌ సొంతం
నగర పాలక సంస్థ కార్యాలయంలోని పలు విభాగాల అధికారులకు కార్లు బాడుగ ఖర్చు కోసం ప్రతి నెలా రూ.5.40 లక్షలు చెల్లిస్తున్నారు. దీంతో సొంత కార్లు లేకపోవడంతో కార్పొరేషన్‌పై భారం పడింది.  అయితే కమిషనర్‌ కొత్త నిర్ణయంతో కార్పొరేషన్‌ అధికారులకు సమకూర్చిన మహేంద్ర ఈ వెరిటో కంపెనీకి చెందిన 15 ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రతి నెలా ఒక్కొక్క కారుకు రూ.20 వేల వంతున నెలకు ప్రస్తుతం రూ.3 లక్షలు చెల్లిస్తే.. ఆరేళ్లకు కార్లు కార్పొరేషన్‌ సొంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతానికి నెలకు రూ.2.40 లక్షల ఖర్చు భారం తగ్గింది. ఆ తర్వాత నుంచి కేవలం చార్జింగ్‌ ఖర్చు మాత్రమే అవుతుంది.

ఈ-కార్లు ఎంతో మేలు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్‌):  ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌లోని విద్యుత్‌ శాఖ గతేడాది 12 ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసింది. అయితే వీటిని నెల్లూరు కేంద్రంగా ఉండే 12 మంది డీఈ, ఏడీఈ స్థాయి అధికారులకు కేటాయించారు. ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగానికి ముందు డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లను ప్రైవేట్‌ యాజమాన్యాల నుంచి అద్దెకు తీసుకుంటుంది. వీటికి ఒక్కొక్క కారు నెలకు 2 వేల కిలో మీటర్ల పరిమితికి రూ.30 వేల అద్దె, ఆపై తిరిగితే కి.మీ.కు రూ.7 వంతున అదనంగా అద్దె చెల్లించాల్సి వచ్చేది. ఈ లెక్కన 12 కార్లకు నెలకు రూ.3.60 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అద్దె చెలిస్తుండేది. వీటి స్థానంలో ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేసిన సంస్థకు నిర్వహణ ఖర్చు లేకపోవడంతో డ్రైవర్లకు మాత్రం నెలకు రూ.15 వేల వేతనంగా చెల్లిస్తోంది. నిర్వహణ (మెయింటెనెన్స్‌) ఖర్చులకు తావుండదు. దీంతో నెలకు 12 ఎలక్ట్రికల్‌ కార్లపై రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదా అవుతోంది.

విద్యుత్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ఏసీ, డీసీ చార్జింగ్‌ పాయింట్లు
రూ.100లతో 100 కిలోమీటర్ల ప్రయాణం 
ఎలక్ట్రిక్‌ కార్లు బ్యాటరీ బ్యాకప్‌ 10 యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. వీటికి చార్జింగ్‌ కోసం కేటగిరీ–2 విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఈ కేటగిరీలో యూనిట్‌ ధర రూ.9.06 ఉంది. ఒక్కసారి చార్జింగ్‌ కోసం 10 యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతుంది. ఈ లెక్కన 10 యూనిట్ల విద్యుత్‌కు సగటున రూ.100 అవుతుంది. ఒక్క యూనిట్‌తో 10 కి.మీ. వంతున 100 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. కారులో ఏసీ వినియోగిస్తే 80 కి.మీ. నడుస్తుంది. కిలోమీటర్‌కు ఖర్చు ఒక్క రూపాయి అవుతుంది.  

డీసీ, ఏసీ చార్జింగ్‌ స్టేషన్లు, పాయింట్లు 
ఈ ఎలక్ట్రిక్‌ కార్లు విద్యుత్‌ చార్జింగ్‌ ఆధారంగానే నడుస్తాయి. కార్లకు విద్యుత్‌ చార్జింగ్‌ చేసే ప్రక్రియలు రెండు రకాలుగా ఉన్నాయి. డీసీ (డైరెక్ట్‌ చార్జింగ్‌), ఏసీ (అ్రల్టానేట్‌ చార్జింగ్‌) రూపాల్లో చార్జ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. డీసీ విద్యుత్‌ ద్వారా అయితే పూర్తిగా చార్జింగ్‌ చేయాలంటే ఒకటిన్నర గంట, అదే ఏసీ విద్యుత్‌ ద్వారా అయితే 6 గంటల సమయం పడుతుంది. విద్యుత్‌ సంస్థ అధికారులు వాడుకునే ఎలక్ట్రిక్‌ కార్ల చార్జింగ్‌ కోసం నగరంలోని విద్యుత్‌ భవన్‌లో ఒక చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు డీసీ, నాలుగు ఏసీ చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటు నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని ఆయా విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో 30 ఏసీ చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల విద్యుత్‌ అధికారులు ఆయా సబ్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఏసీ చార్జింగ్‌ పాయింట్ల ద్వారా ఎలక్ట్రిక్‌ కార్లకు చార్జింగ్‌ చేసుకునే వీలుంది.  

డ్రైవింగ్‌ సులువుగా ఉంది 
డీజిల్, పెట్రోల్‌ కార్ల కన్నా ఎలక్ట్రిక్‌ వాహనాన్ని డ్రైవింగ్‌ చేయడం సులువుగా ఉంది. కారు ఇంజిన్‌ స్టార్ట్‌ చేసినా ఎటువంటి శబ్దం లేకుండా ఉంది. గతంలో కంటే డీజిల్‌కు అయ్యే ఖర్చు కూడా తగ్గింది. కేవలం రూ.105లతో 80.కి.మీ. వరకు మైలేజీ వస్తుంది. 
– ప్రదీప్‌కుమార్, టౌన్‌ప్లానింగ్‌ అధికారి డ్రైవర్‌ 
 
విద్యుత్‌ కారుతో ఖర్చులు కూడా తగ్గాయి  
విద్యుత్‌ కారు వినియోగంతో పెట్రోల్, డీజిల్‌ ఖర్చులు కూడా తగ్గాయి. ఉదయం ఒకసారి చార్జింగ్‌ పెడితే దాదాపు 80 కి.మీ. మేర ప్రయాణం చేసేందుకు వీలు ఉంటుంది. రెండు గంటల్లోనే చార్జింగ్‌ అయ్యేలా చార్జింగ్‌ యూనిట్‌ను కార్పొరేషన్‌లో ఏర్పాటు చేశారు.
– వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్‌ అధికారి డ్రైవర్‌ 

కాలుష్య రహిత కార్లు 
ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడే వీలుంటుంది. దీంతో పాటు తరిగిపోతుçన్న సంప్రదాయ వనరులు అయిన డీజిల్, పెట్రోల్‌ను పొదుపు చేసి భావితరాలకు అందించేందుకు ఎంతో దోహదపడే వీలుంటుంది. అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి మెయింటెనెన్స్‌ లేకుండానే ఎలక్ట్రిక్‌ కార్లను ఉపయోగించు కోవచ్చు.  
– కె.విజయ్‌కుమార్‌రెడ్డి ఎస్‌ఈ, ఏపీ ఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా