పరిశ్రమలకు ‘నవోదయం’

6 Jun, 2020 04:04 IST|Sakshi

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సర్కారు చేయూత 

వాటి ఉత్పత్తుల్లో 25 శాతం ప్రభుత్వ విభాగాలే కొనుగోలు చేసేలా నిర్ణయం

తద్వారా ఎంఎస్‌ఎంఈలకు రూ.25,000 కోట్ల మేర లబ్ధి

ఆర్థిక సాయం అందించేందుకు రూ.1,200 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీ అమలు

గడిచిన ఐదేళ్లలో రాయితీలు అందక మూతపడిన ఎంఎస్‌ఎంఈలు

సర్కారు నిర్ణయాలతో 10 లక్షల మంది ఉపాధికి భరోసా  

సాక్షి, అమరావతి: అవి పేరుకు మాత్రం చిన్న కంపెనీలైనా.. ఉపాధి కల్పించడంలో మాత్రం ముందుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లను ఆదుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ఆర్థిక చేయూత ఇవ్వడమే కాకుండా.. వాటి ఉత్పత్తులు అమ్ముడయ్యేలా భరోసా కల్పించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ విభాగం ఏటా చేసే 360 వస్తువుల్లో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్‌ఎఈల నుంచి కొనుగోలు చేయాలంటూ రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఉత్తర్వులు జారీ చేశారు.  

నవోదయం నుంచి.. రీస్టార్ట్‌ ప్యాకేజీ వరకు..
► గత ప్రభుత్వ హయాంలో 81 వేల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో అవన్నీ ఎన్‌పీఏలుగా మారిపోయాయి. 
► వాటిని ఆదుకునే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ నవోదయం పథకం ప్రారంభించి రూ.2,300 కోట్లతో రుణ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. 
► దీంతో ఎంఎస్‌ఎంఈలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం కలిగింది. 
► తాజాగా కోవిడ్‌–19 నేపథ్యంలో రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద సుమారు రూ.1,200 కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది.  
► ఈ ప్యాకేజీలో రూ.905 కోట్లు పారిశ్రామిక బకాయిలు కాగా.. మిగిలినవి విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల రద్దు, కొత్త రుణాల మంజూరుకు సంబంధించినవి ఉన్నాయి. 
► రెండు విడతలుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న పారిశ్రామిక బకాయిల వల్ల మొత్తం 11,238 యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి.  
► మొదటి విడత కింద విడుదల చేసిన రూ.450.26 కోట్లతో 5,251 యూనిట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి.  
► ఈ నెల 29న మిగిలిన మొత్తం విడుదల కానుండటం, కొత్త టర్మ్‌ రుణాలకు ప్రభుత్వం హామీగా ఉండటంతో.. బ్యాంకులు కూడా వాటికి రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి.  
► 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

రూ.25 వేల కోట్ల కొనుగోళ్లు ఎంఎస్‌ఎంఈల నుంచే.. 
► ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 98 వేల ఎంఎస్‌ఎంఈలలో పనిచేస్తున్న 10 లక్షల మంది ఉపాధికి హామీ లభించింది. 
► రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలన్నీ కలిపి ఏటా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు చేస్తుంటాయని అంచనా. 
► ఇందులో 25 శాతం అంటే సుమారు రూ.25 వేల కోట్ల విలువైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి హామీ లభించిందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. 

సాయంతో పాటు చేయూత 
కష్టాల్లో ఉన్న చిన్న పరిశ్రమలకు నవోదయం, రీస్టార్ట్‌ ప్యాకేజీల కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు వాటి ఉత్పత్తుల్లో 25 శాతం ప్రభుత్వ శాఖలే కొనుగోలు చేసేలా హామీ ఇవ్వడం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జీవం పోస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలను తిరిగి ప్రారంభించి ఉత్పత్తి మొదలు పెట్టడానికి ధైర్యం కలిగింది.    – వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షుడు, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ 

కొత్త వారికి భరోసా 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాల వల్ల పాత యూనిట్లకు భద్రత లభిస్తోంది. కొత్తగా యూనిట్లు పెట్టే వారికి భరోసా కలుగుతోంది. యువ పారిశ్రామికవేత్తలకు ఇది శుభపరిణామం. ఆర్థిక సాయం ప్రకటించి పాత యూనిట్లకు భద్రత కల్పిస్తే.. 25 శాతం కొనుగోళ్ల నిబంధన ద్వారా కొత్తగా యూనిట్లు పెట్టాలనుకునే వారికి ఒక నమ్మకాన్ని కల్పించారు.      
– ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ  

మరిన్ని వార్తలు