ప్రలోభాలకు గురిచేస్తే.. పదవి పోతుంది జాగ్రత్త!

21 Feb, 2020 08:38 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

 పంచాయతీరాజ్‌ చట్ట సవరణలకు ఆర్డినెన్స్‌ జారీ 

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష.. రూ.వెయ్యి జరిమానా

సాక్షి, అమరావతి : గ్రామ పంచాయతీ, ఇతర పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అభ్యర్థులకు ఇది షాకే! ఏ రకంగానైనా వారు ఈ చర్యలకు పాల్పడి.. ఆ తర్వాత అది రుజువైతే వారు గెలిచినా ఆయా పదవుల్లో కొనసాగటానికి వీల్లేకుండా అనర్హులుగా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలే ప్రధాన అంశంగా ఏపీ పంచాయతీరాజ్‌ చట్టానికి పలు సవరణలు చేస్తూ ఇటీవలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం గురువారం ఈ ఆర్డినెన్స్‌ రూపంలో ఉత్తర్వులు వెలువరించింది.

పంచాయతీరాజ్‌ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటానికి, సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం–1994’కు సవరణలను ప్రతిపాదిస్తూ ఆ కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటానికి, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నిరోధించటానికి, మద్యం పంపిణీని అరికట్టాలని సర్కారు సంకల్పించింది. 

ప్రస్తుతం ఎంతో సుదీర్ఘంగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ కాలపరిమితిని తగ్గించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువరించిన రోజు నుంచి 18 రోజుల్లో.. గ్రామ పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణలో సర్పంచ్‌లకు పూర్తి అధికారాలను కల్పించారు. సర్పంచ్‌ సంబంధిత గ్రామంలోనే నివసించాలని.. పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలని నిబంధన విధించారు. వంద శాతం గిరిజన జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్‌ సహా వార్డు సభ్యుల పదవులన్నీ గిరిజనులకు రిజర్వు చేస్తూ నిబంధనను తీసుకొచ్చింది. గ్రామసభలను నిర్వహించటంలో సర్పంచ్‌ విఫలమైనా.. గ్రామ పంచాయతీ అకౌంట్లను సకాలంలో ఆడిట్‌ చేయించకపోయినా సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించే వీలు కల్పించారు. 

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభపరచటం, ఎన్నికల ప్రక్రియలో వారిని పాల్గొనకుండా చేయటం వంటి నేరాలకు అభ్యర్థులు పాల్పడినట్లు తేలితే వారికి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తూ చట్టంలో మార్పులు చేశారు.అధికారుల అలసత్వం లేదా విధి నిర్వహణలో లోపాలుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.   

మరిన్ని వార్తలు