పొలాల్లో ఇళ్లు పోయినట్టే

7 Dec, 2014 00:39 IST|Sakshi
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెంలో మిరప చేను

సాక్షి, హైదరాబాద్: ప్రశాంత వాతావరణం కోసం ఊరికి దూరంగా పొలాల్లో ఇళ్లు కట్టుకున్న రాజధాని ప్రాంత రైతులు ఇక ఆ ఇళ్లపై ఆశలు వదులు కోవాల్సిందే. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లోని పొలాల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకుని ఉంటే ప్రభుత్వం ఆ ఇళ్లను తొలగించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం.. రాజధాని నిర్మాణ సలహా కమిటీతో భూ సమీకరణ విధానంపై నిర్వహించిన సమీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములను సమీకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 
 తాజాగా 29 గ్రామాల్లోని పొలాల్లో నివాసాలుంటే వాటిని తొలగించి, ఇళ్లు కోల్పోయినవారు మరోచోట ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. పొలాల్లోని ఇళ్లను తొలగించాలనే నిర్ణయం నేపథ్యంలో పొలాల్లో, రహదారుల పక్కన గల గృహాలతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న మొత్తం ఇళ్లను లెక్కింపజేయనున్నారు. గృహాల స్థాయిని బట్టి వివిధ కేటగిరీలుగా వర్గీకరించనున్నారు. మరోవైపు పంట భూముల్ని నాలుగు రకాలుగా వర్గీకరించి భూముల వారీగా రైతులకు పరిహారం చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
 
 పరిహారం ఇలా..
 29 గ్రామాల్లో 51,786 ఎకరాలున్నాయని, ఆ గ్రామాల్లో 1,02,408 మంది జనాభా ఉన్నట్లు తేల్చారు. తొలి దశలో 30 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఈ విధానంలో సమీకరించే ఎకరం మెట్ట భూమికి బదులుగా 800 గజాల ఇంటి స్థలం, మరో 100 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలన్నది ప్రతిపాదన. అలాగే ఏడాదికి రూ.25 వేల నుంచి 30 వేలు పరిహారం ఇస్తారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని మాగాణి భూములకైతే ఎకరానికి 1,100 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం, ఏడాదికి రూ.50 వేల నుంచి 55 వేల వరకు పరిహారం చెల్లించే ప్రతిపాదనపై చర్చించారు.
 
 అలాగే ఎత్తిపోతల పథకాల కింది భూములకు ఎకరానికి 1,100 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం. అసైన్డ్ భూముల్లో మాగాణి భూములకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ప్రతిపాదించారు. ఇదే భూముల్లో మెట్టకు ఎకరానికి 800 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. 29 గ్రామాల్లోని 22,405 మంది రైతులకు చెందిన రుణాల్లో రూ.లక్షన్నర  వరకు ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.198 కోట్లు అవసరమని అంచనా. ఈ నెల 15న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి ఆమోదం పొందనున్నారు.
 
 29 గ్రామాల్లోని భూములు, రైతుల వివరాలు..
 జనాభా: 1,02,408  
 స్థలం: 51,786 ఎకరాలు
 ఎస్సీ జనాభా: 32,153, ఎస్టీ జనాభా: 4,663, ఇతరులు: 65,592
 వ్యవసాయం చేస్తున్న రైతులు: 10,656
 కూలీల సంఖ్య: 31,634
 గృహాల్లో పనిచేసే వారి సంఖ్య: 4,010, ఇతరులు: 11,603
 పట్టా భూములు: 37,701 ఎకరాలు
 అసైన్డ్ భూములు: 1,910 ఎకరాలు
 దేవాదాయ భూములు: 723 ఎకరాలు
 అటవీ భూమి: 585 ఎకరాలు
 పోరంబోకు భూములు: 8,730 ఎకరాలు
 అర ఎకరంకన్నా తక్కువమంది ఉన్న రైతులు: 4,000
 అర ఎకరం నుంచి ఎకరం వరకు ఉన్న రైతులు: 5,200
 ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులు: 5,000

మరిన్ని వార్తలు