ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటే తప్పేంటి?: అంబటి

6 Jan, 2015 19:08 IST|Sakshi
ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటే తప్పేంటి?: అంబటి

* జగన్‌ను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?
* టీడీపీపై అంబటి రాంబాబు ధ్వజం

హైదరాబాద్: రైతులను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూ కర్కశంగా వారిని అణగదొక్కాలని చూస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూలిపోవాలని రైతాంగం కోరుకుంటే తప్పేమిటని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పరిస్థితులు వివరించడానికి వచ్చిన రైతులను ఉద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని తప్పు పడుతూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు ఆయనపై ముప్పేట దాడి చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ ‘జగన్ రైతులనుద్దేశించి మాట్లాడిన ప్రతి మాట ఆయనది కాదు, జగన్ మాట్లాడింది జనం మాట’ అని సమర్థించారు. ప్రభుత్వం పడిపోవాలనేది జగన్ కోరిక కాదని తుళ్లూరు ప్రాంత రైతులు తమను బాధలు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే పడిపోతే బాగుండుననే భావనతో ఉన్నారని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పోలీసులను ప్రయోగించి ఫాసిస్టులాగా వ్యవహరిస్తున్నారన్నారు.

శ్రీనాథ్ చౌదరి అనే వ్యక్తి రాజధానికి తాము భూములు ఇవ్వము అన్నందుకు ఏడు రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లి ఇప్పటి వరకూ వదల్లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని, జగన్ ప్రతిపక్ష నేతే కాదని చంద్రబాబు తాబేదార్లు విమర్శిస్తున్నారని వారన్నట్లు నిజంగా జగన్ ప్రతిపక్ష నేత కాకుంటే ఆయనపై ఎందుకింత అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు.

నాడు కబడ్దార్ అన్నారే...!
మే 14, 2011లో చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నపుడు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో మాట్లాడుతూ రైతుల భూముల జోలికి వస్తే కబడ్దార్ అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇపుడేమో రాజధాని ప్రాంత రైతులనే కబడ్దార్ అంటూ బెదిరిస్తున్నారని అంబటి దుయ్యబడుతూ అప్పట్లో టీడీపీ అనుకూల పత్రిక ఒకటి ఈ మేరకు రాసిన వార్త ప్రతిని విలేకరులకు చూపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి భూములను సేకరించాలని, ఆ లాభం రైతులకే చెందాలని, రైతులే సెజ్‌లు పెట్టాలని, తాడేపల్లి, పెనుమాక గ్రామాల్లో భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హెచ్చరించిన చంద్రబాబు ఇపుడు మాట్లాడుతున్నదేమిటని ఆయన అన్నారు.

భూసేకరణకు వ్యతిరేకంగా రైతులను అధికారులపై తిరగబడాలని పిలుపు నిచ్చిన చంద్రబాబు ఇపుడు అదే అధికారులు, పోలీసుల చేత రైతులను అణచివేయాలని చూస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వంలో ఉన్నపుడు రైతులకు అనుకూలంగా మాట్లాడి, ఇపుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంపై చంద్రబాబు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. రాజధాని రైతుల పక్షాన జగన్ మాట్లాడితే ఆయన ఇడుపులపాయలో రాజధాని పెట్టాలంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు జగన్ ఎపుడైనా ఆ మాట అన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

పోలీసులకు భూసేకరణతో ఏంపని?
పోలీసులు భూసేకరణ వ్యవహారంలో తలదూరిస్తే ప్రజాస్వామిక వాదులు సహించరని అంబటి హెచ్చరించారు. పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షించాలే తప్ప భూములివ్వబోమని చెప్పిన రైతులను వేధించడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయం గుర్తెరిగి వారు వ్యవహరించాలన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ పనితీరు భేష్! అని లోకేష్ చేయించిన సర్వేలో ప్రజాభిప్రాయం వ్యక్తమైందని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు అనేకసార్లు తప్పి పాసైన మొద్దబ్బాయ్ కథను ఈ వ్యవహారం గుర్తుకు తెస్తోందని వ్యంగంగా అన్నారు.

తన పాలనకు లోకేష్ 70 మార్కులు వేశారని ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న చంద్రబాబు తుళ్లూరు ప్రాంతానికి వెళితే అక్కడ ఒక్క మార్కు కూడా వేయరన్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రతిపక్ష నేత జగన్ తప్పకుండా పర్యటిస్తారని అంబటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.   

మరిన్ని వార్తలు