‘క్రాప్‌ హాలిడే’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్‌

11 Nov, 2019 15:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వ్యవసాయం సరిగా లేకపోతే మనిషి మనుగడ సరైన దారిలో ఉండదని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. డాక్టర్‌ యలమంచిలి శివాజీ రచించిన ‘క్రాప్‌ హాలిడే’ పుస్తకాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథ్‌ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, రైతు  దేశానికే వెన్నుముక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకం ప్రవేశ పెట్టిందని, రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. 

క్రాప్ హాలిడే పుస్తకం భగవద్గీత వంటిది
క్రాప్ హాలిడే అనేది రైతుల్లో ఒక మేలు కొలుపులా పని చేసిందని అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. శివాజీ లాంటి మనిషి మనకు దొరకడం అదృష్టమన్నారు. రైతు సమస్యలపై పార్లమెంటులో అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలపై అన్ని పార్టీల వారిని ఏకం చేసేవారని ప్రస్తవించారు. వ్యాపారవేత్తల చేతిలో పొగాకు రైతులు ఎలా మోసపోయారనే విషయాన్ని పుస్తకంలో స్పష్టం చేశారన్నారు. పొగాకు రైతులు తమ సమస్యలు నుంచి ఎలా బయట పడలనే విషయాన్ని కూడా వివరించారని, రైతు సమస్యలపై ప్రభుత్వాలకు అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు సంబంధించినంత వరకు క్రాప్ హాలిడే పుస్తకం అనేది భగవద్గీత వంటిదన్నారు. 

రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: యలమంచిలి
పది కోట్ల మందికి పైగా రైతులు వ్యవసాయ చేస్తుంటే అందులో పొగాకు పండించేవారు లక్షల్లోనే ఉన్నారని యలమంచిలి శివాజీ తెలిపారు. పొగాకు కోసం పార్లమెంటులో పోరాటం చేస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపేవని, గతంలో ఎన్నడూ పొగాకు రైతు క్రాప్ హాలిడే చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. పొగాకు రైతులు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నాదని, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు తలెత్తితే దేశంలో అందరూ స్పందిస్తున్నారని, అదే రైతులకు నష్టం వస్తే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వాలు మరింతగా ఆదుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు