ఏపీ బడ్జెట్‌: 3.98 కోట్ల మందికి లబ్ధి

16 Jun, 2020 10:17 IST|Sakshi

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి

మేనిఫెస్టోలో లేని 40 హామీలు అమలు

5.5 లక్షల కరోనా  పరీక్షలు పూర్తి

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించిన గవర్నర్‌

సాక్షి, అమరావతిగడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యా, వైద్యం ఆరోగ్యం రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉందని, రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశామని గుర్తుచేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ (2020-21) సమావేశాలు సందర్భంగా గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగం చేశారు.

ఆరోగ్యశ్రీ కింద 6.25 లక్షల మందికి లబ్ధి
రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్ బిశ్వభూషన్‌  ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల హామీలో ఇవ్వని 40 పథకాలను సైతం విజయవంతగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో వివిధ పథకాల కింద 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారు. దీని కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి సాధించాం. 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చారు. 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్దు పథకం అమలు చేస్తున్నాం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం.

12వేల వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు
జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీనికోసం 3857 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్‌ఆర్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మంది పొందారు. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్‌ఆర్‌ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి.. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు పెట్టాం. గ్రామ సచివాలయాల్లో 12వేల వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజా ఆరోగ్యంలో భాగంగా 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం మొదటి దశ పూర్తయింది, రూ.12500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13500లకు పెంచాం. మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ.. రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం.

30 లక్షల మందికి ఇళ్లపట్టాలు
కౌలు రైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం. ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం. జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి,  కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధికి రూపకల్పన చేశాం. రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం. మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం. 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి.

36,810 మందికి ఉద్యోగ అవకాశాలు
జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో14 ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేశాం. మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్‌, సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం. విద్యుత్‌ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం. ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం. దీని ద్వారా 36,810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్‌ఆర్‌ నవోదయ పథకాన్ని ప్రారంభించాం. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశాం. జీఎంఆర్‌ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రూ. 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం’

5.5 లక్షల పరీక్షలు పూర్తి
కోవిడ్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది. కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది. రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం. రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం టెస్టింగ్‌ ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచింది. రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులున్నాయి.  కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు. 5,400 ఐసీయూ బెడ్స్‌, 38వేల ఐసోలేషన్‌ బెడ్స్‌ ఆక్సిజన్‌ సరఫరాతో 15వేల బెడ్స్‌ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు