నేడు జిల్లాకు రానున్న గవర్నర్‌

31 Oct, 2019 08:40 IST|Sakshi

సాలూరు ప్రాంతంలో నేడు పర్యటన

రోజంతా అక్కడి ప్రజలతో మమేకం 

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసుశాఖ 

సాక్షి విజయనగరం  : రాష్ట్ర ప్రధమ పౌరుడు, గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరి చందన్‌ తొలిసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. గురువారం ఆయన సాలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారు కావడంతో అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ముఖ్యంగా గిరిజనులతో సమావేశమవుతారు. ప్రభుత్వ పరంగా వారికి అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి చర్చిస్తారు. అధికారులు గిరిజన సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ఆయనకు వివరించేందుకు సిద్ధమయ్యారు.  

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఒక్కరోజు పర్యటన నిమిత్తం గురువారం జిల్లాకు వస్తున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా సాలూరుకు హెలీక్యాఫ్టర్‌లో వస్తున్న ఆయన అక్కడ గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహానికి వెళ్లి వారితో మాట్లాడుతారు. అక్కడి నుంచి అమ్మవలస వెళ్లి గిరిజనులు సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకుని అక్కడి వారితో ముఖాముఖి అవుతారు. అనంతరం పి.కోనవలస ఆశ్రమ పాఠశాలలో జూనియర్‌ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతారు. అనంతరం ఆయన విశాఖపట్నం వెళతారు. ఈ పర్యటనలో ఆయన పూర్తిగా గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.  

గవర్నర్‌ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటనలో భాగంగా హెలీప్యాడ్‌ మొదలుకుని ఆయన పర్యటించే ప్రాంతాల్లో పక్కాగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గిరిజనులతో మాటాడేందుకు ఏర్పాటు చేయడమే గాకుండా... గిరిజనులను కూడా ఇందుకోసం సిద్ధం చేశారు. ప్రభుత్వపరంగా అమలవుతున్న కార్యక్రమాలు వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

దేశంలో మరెక్కడా లేని విధంగా సాలూరులో ఏర్పాటైన గర్భిణుల వసతి గృహాన్ని మొదటి గా గవర్నర్‌ సందర్శించనున్నారు. ప్రత్యేకించి గర్భిణుల కోసం ఇక్కడ గతేడాది అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశ ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. కొండప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సరైన పోషకాహారం అందకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. ఈ అంశాలపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిక కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో పీఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేసి గర్భిణులకు సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు ఇక్కడ సుమారు 300మంది గర్భిణులు ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం 28మంది గిరిజన మహిళలు ఇక్కడ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అందుతున్న సదుపాయాలు, ప్రభుత్వ లక్ష్యం తదితర విషయాల గురించి గవర్నర్‌ తెలుసుకోనున్నారు. 

అమ్మవలసలో గిరిజన రైతులతో ముఖాముఖి :ఇదిలాఉండగా తదుపరి పర్యటనలో ఆయన అమ్మవలస గ్రామంలో గిరిజనులు పంటలు పండించే విధానం గురించి తెలుసుకుంటారు. అక్కడి గిరిజనులు పత్తి పంట ద్వారా లాభాలు పొందుతున్నారు. పత్తితోపాటు అంతర్‌పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకుని తర్వాత గిరిజనులతో పంటలతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుతారు. అనంతరం గవర్నర్‌ పి.కోనవలస గిరిజన సంక్షేమ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో పలు అంశాలపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆయన వచ్చి వెళ్లేందుకు, గిరిజనులతో మాట్లేందుకు, పంటలు పరిశీలించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎం. హరి జవహర్‌లాల్, ఐటీడీఏ పీఓ బి.ఆర్‌.అంబేడ్కర్‌  బుధవారం మరోసారి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు