యువత చేతుల్లోనే జాతీయ సమైక్యత

20 Dec, 2019 04:15 IST|Sakshi

నేషనల్‌ రోలర్‌ స్పోర్ట్స్‌ ప్రారంభించిన గవర్నర్‌

విశాఖ స్పోర్ట్స్‌: జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విశాఖ సాగర తీరంలోని వుడా పార్క్‌ రింక్‌లో ఏర్పాటు చేసిన 57వ నేషనల్‌ రోలర్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న స్కేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ అనేది క్రీడల ద్వారా వస్తుందన్నారు. యువత తమ చుట్టూ ఉండే సమాజం పట్ల అవగాహన కలిగిఉండాలని ఉద్భోద చేశారు. ఇప్పటికే కాడెట్‌ నేషనల్స్‌ పూర్తి కాగా గురువారం నుంచి జూనియర్‌ నుంచి సీనియర్స్‌ కేటగిరీల్లో స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్‌హాకీ, ఇన్‌లైన్‌ హాకీ, ఇన్‌లైన్‌ ఫ్రీస్టయిల్, స్కేట్‌బోర్డ్, రోలర్‌ ఫ్రీస్టయిల్‌ తదితర అంశాల్లో పోటీలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తొలుత రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల్లోనే రూ. రెండు కోట్లు క్రీడాకారులకు నజరానాగా ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతహాగా క్రీడాకారుడు కావడంతో క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తున్నారన్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, స్కేటింగ్‌ సమాఖ్య ప్రతినిధులు తులసీరామ్, నరేష్‌కుమార్, టోర్నీ నిర్వాహక కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలీస్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభం  
విశాఖ వేదికగా 20వ ఆలిండియా పోలీస్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా అండ్‌ ఆర్డర్‌ కాపాడటంలోనే కాకుండా విశాఖ నగరాన్ని అందంగా ఉంచేందుకు పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. తొలుత నగర సీపీ ఆర్‌కే మీనా మాట్లాడుతూ దేశంలోని 18 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్, అదనపు డీజీపీ ఎన్‌.శ్రీధర్‌రావు పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు