రుణమాఫీకి ఆధార్‌తో లింక్

12 Jul, 2014 02:19 IST|Sakshi
రుణమాఫీకి ఆధార్‌తో లింక్

బ్యాంకర్లకు సూచించిన  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
 
రుణమాఫీ నుంచి బోగస్ రైతులను ఏరివేయొచ్చు
ఒక రైతుకు ఒక రుణమే మాఫీ ?

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాల వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం రైతుల రుణాలకు సంబంధించిన ఖాతాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధా నం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి సూచించారు. రుణ మాఫీ విధివిధానాలు, రుణ మాఫీకి అవసరమైన నిధుల సేకరణ అంశాలపై సీఎం శుక్రవారం ఉదయం కోటయ్య కమిటీతో, సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేంద్రన్, కన్వీనర్ దొరస్వామితో సమావేశమై చర్చించారు. రైతుల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానిస్తే బోగస్ రైతులను రుణ మాఫీ నుంచి ఏరివేయవచ్చునని, అలాగే ఒక రైతుకున్న వివిధ రుణాలన్నీ వెల్లడవుతాయని రాజేంద్రన్‌కు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం మంది రైతుల ఖాతాలకే ఆధార్‌తో అనుసంధానం ఉందని, మిగతా వారికి లేదని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఆధార్ ఉంటేనే రుణ మాఫీ వర్తిస్తుందని, లేదంటే మాఫీ కాదని చెప్పాలంటూ బ్యాంకర్లకు సూచించారు. అలా చేస్తే రైతులే ఆధార్ అనుసంధానానికి వస్తారని చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒక్కో రైతు పేరిట బ్యాంకుల్లో ఎన్నిరుణాలున్నాయో మొ త్తం వివరాలు తెలుస్తాయని, రైతుకు ఒక రుణమే మా ఫీ చేయడానికి వీలవుతుందని సీఎం పేర్కొన్నారు.

రైతులకు నోటీసులు తప్పవు: బ్యాంకర్లు

రుణ బకారుులపై రైతులకు నోటీసులు జారీ చేయకుండా ఉండటం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేయడమే కాకుండా బ్యాంకులు తదుపరి చర్యలను సైతం చేపడతాయని, దీన్ని నివారించలేమని ముఖ్యమంత్రికి చెప్పారు. గత ఖరీఫ్‌లో తుపాను, కరువు బారిన పడ్డ మండలాల్లోని రైతుల రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐ నుంచి వెలువడే మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చిన తర్వాత రైతుల రుణ మాఫీ విధానాన్ని వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆర్‌బీఐ నుంచి స్పష్టత రాకుండా ముందుకు వెళ్లలేమనే అభిప్రాయం వ్యక్తమైంది.  ఒక్కో రైతుకు లక్షన్నర వరకు రుణ మాఫీ చేస్తే ఎంత అవుతుందనే అంశంపై కూడా సమావేశంలో చర్చిం చారు. రూ.30 వేల కోట్లు అయ్యే అవకాశం ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. రీ షెడ్యూల్ కాని రైతుల రుణాలకు నిధుల సేకరణపై కూడా కోట య్య కమిటీతో సమావేశంలో చంద్రబాబు చర్చిం చారు.  బ్రూవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నందున, ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకునే అవకాశాలపై సీఎం సమాలోచన జరిపారు.
 
 

మరిన్ని వార్తలు