రూపాయికే ఎకరం

21 Mar, 2017 08:55 IST|Sakshi
రూపాయికే ఎకరం

తొలుత రూ.8 లక్షలకు కేటాయిస్తూ జీవో
ఎకరం రూ.లక్ష చొప్పున ఇవ్వాలని కోరిన బీఐఏసీఎల్‌
తీవ్రంగా స్పందించి రూపాయికే కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సర్కారు తీరుపై రెవెన్యూ అధికారుల విస్మయం


సాక్షి, అమరావతి: భలే చౌక భేరం. రూపాయికే ఎకరా భూమి. రూ.638కే 638 ఎకరాల భూమి కేటాయింపు. భూమి కోరిన సంస్థ ఎకరా రూ.లక్షకు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తం ఎందుకు? రూపాయికే ఇస్తామంది. చెప్పడమే కాదు రూ.638.83కు 638.83 ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ఏకంగా జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాల్లో 638.83 ఎకరాలు కేటాయించాలని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఐఏసీఎల్‌) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ కర్నూలు జిల్లా ఓర్వకల్‌ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో ఎకరా రూ.8 లక్షల మార్కెట్‌ ధరతో 638.83 ఎకరాలు కేటాయించవచ్చంటూ గత ఏడాది నవంబరు 12వ తేదీన ప్రతిపాదన పంపించారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ) గత ఏడాది నవంబరు 17వ తేదీన సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టరు ప్రతిపాదనను యథాతథంగా ఆమోదించింది.

ఎకరా రూ. 8 లక్షల మార్కెట్‌ ధరతో బీఐఏసీఎల్‌కు 638.83 ఎకరాలు కేటాయించాలని ఏపీఎల్‌ఎంఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ మేరకు ఎకరా రూ.8 లక్షల ధరతో 638.83 ఎకరాలను బీఐఏసీఎల్‌కు కర్నూలు జిల్లా ఓర్వకల్‌ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో కేటాయిస్తూ రెవెన్యూ శాఖ గత నెల మూడో తేదీన జీవో నంబరు 46 జారీ చేసింది. ఈ మేరకు ఈ సంస్థకు మార్కెట్‌ విలువకు భూమిని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఆగమేఘాలపై ధర తగ్గింపు ఉత్తర్వులు
ప్రజాప్రయోజనాల కోసమే విమానాశ్రయం నిర్మాణానికి ముందుకు వచ్చామని, ఇంత ధరతో భూమి కేటాయిస్తే గిట్టుబాటు కాదని బీఐఏసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేఖ రాయడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. అంత ధరతో భూమి కేటాయిస్తే భారమవుతుందని, ఎకరా రూ. లక్ష నామమాత్రపు ధరతో కేటాయించాలని ఆయన గత నెల 6న ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు. ఈ లేఖ అందడమే తరువాయి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఎకరా రూపాయికే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఎకరా రూపాయికే కేటాయిస్తున్నట్లు తాజాగా సోమవారం జీవో 107 జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారం పట్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు.

ఇదెక్కడి ద్వంద్వ విధానం?
భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో సంస్థ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడలో ఇండియన్‌ నేవీకి వంద ఎకరాలు ఎకరా రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తూ 2003 డిసెంబరు 3వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో నంబరు 1241 జారీ చేసింది. ఈ మేరకు రూ.5 కోట్లు ఇండియన్‌ నేవీ ప్రభుత్వానికి చెల్లించింది. ఈ భూమిని తమకు అప్పగించాలని నేవీ అధికారులు కోరగా, అంత భూమి ఇవ్వలేమని, తగ్గించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సర్కారు ఒత్తిడి తేవడంతో చర్చల్లో 80 ఎకరాలతో సరిపెట్టుకుంటామని ఇండియన్‌ నేవీ అధికారులు చెప్పారు. చివరకు అంత కూడా కేటాయించకుండా 65 ఎకరాలతోనే సరిపెట్టుకోవాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. వంద ఎకరాలకు సొమ్ము చెల్లించినందున తమకు ఇస్తున్న 65 ఎకరాలకు పోనూ మిగిలిన 35 ఎకరాలకు సంబంధించిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఇండియన్‌ నేవీ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. వంద ఎకరాలకు తీసుకున్న మొత్తాన్ని 65 ఎకరాలకే సరిపెట్టుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 21వ తేదీన జీవో 80 జారీ చేసింది. ఇది సర్కారు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అధికారులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు