రైతులను ఆదుకుంటాం

27 Apr, 2020 02:49 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో నీట మునిగిన వరి పనలను చూపిస్తున్న రైతు

నష్టం అంచనా వేసి తక్షణ సాయానికి సీఎం ఆదేశాలు.. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు

అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం భరోసా

మొత్తం 5,069 హెక్టార్లలో పంట నష్టం

వరి పంట నష్టంపై అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

తడిసిన ధాన్యంపై ఆందోళన వద్దు: మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వరి పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. కొన్ని చోట్ల వరి తడిసినట్టు తమ దృష్టికి వచ్చిందని, దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ముఖ్యమంత్రితో మాట్లాడి, తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. దీంతో వరి పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో  వరి, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, 4579 హెక్టార్లలో,  అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు 490 హెక్టార్లలో మొత్తం 5069 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. 

ఆహార పంటలకు జరిగిన నష్టం..
గడిచిన 48 గంటల్లో అకాల వర్షాలకు ఏడెనిమిది జిల్లాల్లో పంటలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 4579 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో వరి, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 హెక్టార్లలో పొగాకు కూడా దెబ్బతిన్నట్టు అంచనా. తూర్పు గోదావరి జిల్లాలో 9 వేల హెక్టార్లకు పైగా వరి పంట నేలకొరిగింది. అయితే ఇదంతా నష్టం కాదని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ చెప్పారు. 

ఉద్యాన పంటలకు నష్టం ఇలా
అకాల వర్షాలకు మొత్తం 490 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్టు ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధురి తెలిపారు.  
► వెఎస్సార్‌ కడప జిల్లాలో 9 మండలాలలో 316 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో మామిడి 122 హెక్టార్లు, అరటి 155.5 హెక్టార్లు, జామ 1.50, నిమ్మ 3, బొప్పాయి 27.50 హెక్టార్లుగా అంచనా.
► అనంతపురం జిల్లాలో 9 మండలాలలో 32.80 హెక్టార్ల లో అరటి, తమలపాకు,  విజయనగరం జిల్లాలో 30 హెక్టార్లలో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. 
► కర్నూలు జిల్లాలో 63.2 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మునగ పంటలు దెబ్బతిన్నాయి. 
► చిత్తూరు జిల్లాలో వరి పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. 

జిల్లాల్లో పంట నష్టం అంచనా 
కృష్ణాజిల్లాలో 3564 హెక్టార్లలో ఆహార పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా.  ప్రధానంగా 13 మండలాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 9,334 హెక్టార్లలో వరి పంట నేలకొరిగినట్లు అంచనా. వరి పనలు, ధాన్యం కుప్పలు తడిసినట్టు రైతులు చెప్పారు. అనంతపురం జిల్లాలో రూ. 3 కోట్లకుపైగా పంట నష్టం అంచనా వేయగా, మొక్కజొన్న, వరి పంటలు 200 హెక్టార్లలో దెబ్బతినడంతో రూ.1.80 కోట్లు పంట నష్టం జరిగినట్లు అంచనా. కర్నూలు జిల్లాలో రూ.2.56 కోట్ల పంట నష్టం అంచనా.  విజయనగరం జిల్లాలో మొక్కజొన్న 200 హెక్టార్లలో, వరి 64 హెక్టార్లలో, నువ్వు 60 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. విశాఖ జిల్లాలో 51.81 హెక్టార్ల వరి తడిసింది. 98.20 హెక్టార్లలో నువ్వు, 5 హెక్టార్లలో పొద్దు తిరుగుడు, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లింది. 

మరిన్ని వార్తలు