ఏపీలో రూ.25కే కిలో ఉల్లి..

7 Dec, 2019 19:52 IST|Sakshi

రాయితీపై సరఫరా చేస్తోన్న ఏపీ ప్రభుత్వం

సాక్షి, సచివాలయం: ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉల్లిని రాయితీపై అందించడానికి చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో యంత్రాంగం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రం వెలుపల మార్కెట్లలో కూడా ఏపీ ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25కే ఉల్లిని సరఫరా చేస్తోంది. అధిక ధరకు కొనుగోలు చేసిన ఉల్లిని సామాన్యులకు రూ.25కే రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. శనివారం 400 టన్నులు కొనుగోలు చేయగా, శుక్రవారం 369 టన్నుల ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఉల్లి సమస్యను పరిష్కరించడానికి కర్నూలు, షోలాపూర్‌, తాడేపల్లిగూడెం, ఆళ్వార్‌ మార్కెట్ల నుంచి ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 3,395 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయగా, రైతుబజార్‌లో రూ.25కే ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది.
(చదవండి: ‘ఉల్లి’కి ముకుతాడేద్దాం)

మరిన్ని వార్తలు