పీజీ వైద్య ఫీజులపై కసరత్తు కొలిక్కి

25 May, 2020 03:52 IST|Sakshi

వివిధ రాష్ట్రాల్లో వసూలుచేస్తున్న ఫీజుల పరిశీలన

యూపీలో కాలేజీల గ్రేడింగ్‌ను బట్టి వసూలు

కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ

త్వరలో ఉత్తర్వులు జారీచేయనున్న వైద్య ఆరోగ్యశాఖ

సాక్షి, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్య ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు దాదాపు పూర్తయింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు కలిసి ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపి ఫీజులు ఎంతమేరకు నిర్ణయించాలి అన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ కోటాలో ఇచ్చే 50 శాతం సీట్లకు, యాజమాన్య, ఇన్‌స్టిట్యూషనల్, ఎన్‌ఆర్‌ఐకి ఉన్న 50 శాతం సీట్లకు ఎంత నిర్ణయించాలి అన్నదానిపై చర్చించారు. అలాగే.. వివిధ రాష్ట్రాల్లో  ఫీజులు ఎలా ఉన్నాయి.. మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎన్‌ఆర్‌ఐ, యాజమాన్య కోటా సీట్లకు ఇక్కడే ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న విషయం అధికారులు గమనించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు, తమకు ప్రభుత్వ కోటాలో ఇస్తున్న సీట్లకు ఫీజులు పెంచాలని లేఖలు రాశాయి. దీంతో వీలైనంత త్వరలో ఫీజులు నిర్ణయిస్తామని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

ఫీజులపై అధికారులిచ్చిన నివేదికలో ఇలా..
► ఏపీలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 50 శాతం (స్పెషాలిటీల వారీగా) ప్రభుత్వ కోటా కింద భర్తీచేస్తున్నారు.
► మిగతా 50 శాతం సీట్లలో 25 శాతం నీట్‌ మెరిట్‌లోనూ, మిగతా 10 శాతం సీట్లు ఇన్‌స్టిట్యూషన్‌ కోటా కింద (కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు), 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటా కింద ఉన్నాయి.
► ఉత్తరప్రదేశ్‌లో కాలేజీ గ్రేడింగ్‌ను బట్టి ఫీజులు వసూలుచేస్తున్నారు.
► ఏపీతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఫీజులు తక్కువగా ఉన్నట్లు తేలింది.
► డీమ్డ్‌ వైద్య కళాశాలల్లోనూ ఫీజులు పరిశీలించారు.
► చాలా రాష్ట్రాల్లో జనరల్‌ మెడిసిన్‌ సీటుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇన్‌స్టిట్యూషనల్‌ కోటా కింద సీట్లు లేవు.
► దీంతో సీట్ల కేటాయింపులు, ఫీజుల నిర్ణయంలో మార్పులు జరగాల్సి ఉందని అధికారులు తేల్చారు.

మరిన్ని వార్తలు