చీకటి గిరుల్లో వెలుగు రేఖలు..

22 Sep, 2019 09:03 IST|Sakshi

ఇన్నాళ్లూ చీకట్లోనే బతుకీడ్చిన అడవి బిడ్డలు

త్వరలో గిరిజన గూడేలకు విద్యుత్‌ లైన్లు, అన్ని తండాలకూ రోడ్లు

నేరుగా గిరిజనుల ఇళ్లకే రేషన్‌ సరుకులు, అందుబాటులోకి ఆరోగ్య కార్యకర్తలు

శరవేగంగా సౌకర్యాల కల్పన

ఆ ఊళ్లు కాకులు దూరని కారడవులో.. చీమలు దూరని చిట్టడవులో కావు. మన్యంలో మండల కేంద్రాలకు కూతవేటు దూరంలోని గిరిజన పల్లెలు. ఆ గ్రామాల వారు ఇప్పటికీ సూర్యుడి వెలుగు తప్ప విద్యుత్‌ వెలుగులు ఎరుగని పరిస్థితి. ‘విద్యుత్‌ స్తంభాలు మేమే వేసుకుంటాం. మేమే మోసుకుని కొండపైకి తెచ్చుకుంటాం. మా గ్రామాలకు విద్యుత్‌ లైన్లు ఇవ్వండయ్యా’ అని వారంతా ఎన్నిసార్లు మొత్తుకున్నా గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ప్రాణాలు అరచేత పెట్టుకుని చీకట్లోనే బతుకీడుస్తున్న ఆ అడవి బిడ్డల కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయ్‌. గిరిజన గూడేలకు త్వరలో విద్యుత్‌ లైన్లు రానున్నాయ్‌. రహదారులకు నోచుకోనున్నాయ్‌. ఆరోగ్య కార్యకర్తలూ అందుబాటులోకి రానున్నారు. మారుమూల గిరిజన పల్లెల్లో సౌకర్యాలు కల్పించేదిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన్యంలోని పల్లెలు, తండాల్లో గిరిపుత్రుల స్థితిగతులను పరిశీలించేందుకు ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మండల కేంద్రమైన గూడెం కొత్తవీధి (జీకే వీధి) గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో.. అదే పంచాయతీ పరిధిలోని కొమ్ము సంపంగి గ్రామంలోని పరిస్థితుల్ని గమనించింది. అక్కడ 24 కుటుంబాలు.. చిన్నాపెద్దా.. ముసలీముతకా కలిపి మొత్తంగా 86 మంది ఆదివాసీలు నివశిస్తున్నారు. ఆ గ్రామానికి చేరుకోవాలంటే జీకే వీధి నుంచి పందిరాయి కొత్తగూడెంకు 6 కిలోమీటర్ల రహదారి మార్గం ఉంది. వాగులు, ఎత్తైన కొండలు గల ఆ రహదారి మార్గంలో కేవలం ద్విచక్ర వాహనాలే అతికష్టం మీద వెళ్తాయి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు నడక దారిన కొండలు దిగి వెళితే కొమ్ము సంపంగి పల్లె వస్తుంది. అగ్గిపెట్టె కావాలన్నా 6 కిలోమీటర్ల దూరంలో చిన్న బడ్డీ కొట్టు ఉన్న పామురాయి గ్రామం వెళ్లాల్సిందే. రేషన్‌ తీసుకోవాలంటే 10 కిలోమీటర్ల దూరంలోని పాతవీధి పల్లెలో ఉన్న డిపోకి వెళ్లాలి. అంగన్‌వాడీ కేంద్రమైతే 9 కిలోమీటర్ల దూరంలోని కంపమాని పాకలు అనే గ్రామంలో ఉంది. ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించేందుకు కనీసం కాలిబాట కూడా లేదు. ఆ ఊళ్లో మూడు గుర్రాలున్నాయి. అవే ఆ గ్రామస్తులందరి ప్రయాణ అవసరాలను తీరుస్తాయి.   

11 మండలాల్లో.. వందలాదిగా..  
ఈ పరిస్థితి ఒక్క కొమ్ము సంపంగి పల్లెలోని కాదు. కనీస వసతులకు నోచుకోని తండాలు, పల్లెలు, నివాస ప్రాంతాలు విశాఖ మన్యంలోని 11 మండలాల్లో వందల్లో ఉన్నాయి. సరైన రహదారుల్లేని పల్లెలు 1,500కు పైగానే ఉన్నాయి. విద్యుత్‌ సౌకర్యం లేని పల్లెలు వందకుపైగా ఉన్నాయి. జీకే వీధి మండలంలోనే కొత్తపాలెం, నూతిబంద, గునుకురాయి, మూలగరువు, కొయ్యూరు మండలం రెమ్మలపాలెం, రేవులకోట, కంఠారం, మండపల్లి, పుట్టకోట, జోతులమామిడి, లేతమర్రి, వెదురులంక, జి.మాడుగుల మండలం ఓలిమామిడి, అనంతగిరి మండలం కొత్తవలస, దాయర్తీ, చీమిడివలస గ్రామాలతోపాటు వీటి చుట్టుపక్కల తండాల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు.

అప్పట్లో గాలి దీపాలు పెట్టారు
మూడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యువజన పథకం (డీడీయూజేవై) కింద గాలిలో దీపాల్లాంటి స్టాండ్‌ ఎలోన్‌ సిస్టమ్‌ సోలార్‌ లైట్లను కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసింది. 288 గ్రామాల్లో రూ.69 కోట్ల వ్యయంతో సోలార్‌ లైట్లు బిగించగా.. కొద్దిరోజులకే పాడైపోయాయి. ఈ పనుల పేరిట టీడీపీ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారే తప్ప వెలుగులు మాత్రం రాలేదు.

కొత్త సర్కారుతో వెలుగు
ఇన్నేళ్లూ సమస్యలతో సహవాసం చేస్తూ చీకట్లోనే ప్రాణాలొడ్డి బతుకుతున్న గిరిజనులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో వెలుగు వచ్చినట్టయింది. మూడు నెలలుగా మారుమూల మన్యం పల్లెలపై అధికారులు దృష్టి సారించారు. కనీస సౌకర్యాల కల్పనకు శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. నేరుగా ఆ పల్లెలు, తండాలకు లైన్లు వేసి విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్‌ నిధులతో అన్ని గ్రిడ్‌లను కలిపి విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్‌ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. ఇందుకు తొలి దశగా రూ.32 కోట్లు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు చేపడతామని వెల్లడించారు. ఇప్పటివరకు గిరిజనులు రేషన్‌ కోసం కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొంది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా వారి ఇళ్లకే సరుకులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని పాడేరు ఇన్‌చార్జి కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి డీకే బాలాజీ వెల్లడించారు. నెలలు నిండిన గర్భిణుల కోసం అరకులో నెలన్నర క్రితం ప్రత్యేక హాస్టల్‌ ఏర్పాటు చేశామని, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను గిరిజనులకు అందుబాటులో ఉంచుతున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సనపల తిరుపతిరావు చెప్పారు.  

విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి పరిధిలోని కొమ్ము సంపంగి గ్రామానికి చెందిన ఈ గిరిజన మహిళ పేరు సుందరి పేంగు. ఈ మధ్యే ఓటు వేసేందుకు ఆమె కొండ దిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఇందుకోసం ఆమె 6 కిలోమీటర్ల మేర అడవి గుట్టల వెంట నడిచింది. ఆ తరువాత వాగులు, ఎత్తైన కొండల మధ్య కాలిబాట మార్గంలో మరో 6 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ పరిస్థితి ఆమెకు మాత్రమే పరిమితం కాదు. విశాఖ గిరిజన తండాల్లోని అడవి బిడ్డలంతా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆమెను కదిలించగా..
‘ఏళ్ల నుంచి కొండల మధ్య సీకట్లోనే బతుకుతున్నామయ్యా. అగ్గి డబ్బా కావాలన్నా మూడు మైళ్లు నడిసెళ్లాల. మా గూడెంలో ఏం దొరకవ్‌. మొన్నటిదాకా సర్కారోళ్లెవరూ రాలే. కొత్త పెబుత్వం వచ్చిందిగా.. మూడు నెలల్నుంచి అధికారులొత్తన్నారు. త్వరలో కరెంటిత్తామంటున్నారు. రోడ్లు ఏత్తామంటున్నారు. రేషన్‌ బియ్యం కూడా ఇంటికే తెచ్చిత్తారంట. మొత్తాన్ని ఇన్నేళ్లకి మా బతుకుల్లో వెలుగు వత్తాందంటే సంతోషమే గదా’ అని చెప్పుకొచ్చింది.

కాన్పు అయినా..పాము కాటైనా..నాటు వైద్యమే
ఇక ఏఎన్‌ఎంలు ఆ పల్లెకి వచ్చే సాహసం చేయలేదు. దీంతో పాము కరిచినా.. గర్భిణులు కాన్పుకైనా నాటు వైద్యంతోనే సరిపెట్టేస్తారు. పరిస్థితి విషమిస్తే అప్పటికప్పుడు డోలీ కట్టి 10 కిలోమీటర్ల దూరం నడిచి వెళితే గానీ రోడ్డు మార్గం రాదు. ఈలోగా ప్రాణం దైవాధీనమే. పిల్లలు చదువుకోవాలంటే 6 కి.మీ. దూరంలోని పామురాయి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలి. ఆ పల్లెలో 25 మంది చిన్న పిల్లలుంటే.. కేవలం నలుగుర్ని మాత్రమే పామురాయిలో తెలిసిన వారి ఇళ్లల్లో ఉంచి చదివిస్తున్నారు.

రహదారుల నిర్మాణంపై దృష్టి
విశాఖ మన్యంలోని తండాలు, పల్లెల్లో నివసిస్తున్న గిరిపుత్రుల ప్రధాన సమస్య రహదారులే. రోడ్లు బాగుంటే సగం సమస్యలు తీరినట్టే. అందుకే రోడ్ల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టి సారించాం. విశాఖ ఏజెన్సీలో దాదాపు 1,500 నివాస ప్రాంతాల్లో సరైన రహదారుల్లేవు. ఉపాధి హామీ పథకం కింద రోడ్ల నిర్మాణం చేపడతాం.త్వరలోనే నిధులు రానున్నాయి. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని క్షేత్రస్థాయిలో పర్యటించేలా ఆదేశాలు జారీ చేస్తాం.
– డీకే బాలాజీ, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్, పాడేరు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా