కరోనా కట్టడికి కొరియా విధానం

28 Apr, 2020 02:29 IST|Sakshi

టెస్టులతో కట్టడి చేసిన దక్షిణ కొరియా

అదే విధానాన్ని అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

దక్షిణ కొరియాలో అధిక టెస్టులు జరిపారు.. ఒకదశలో రోజుకు 800 కేసులు నమోదయ్యేవి, పాజిటివ్‌ కేసులు పెరిగినా వెరవకుండా కొనసాగించారు.. క్వారంటైన్‌లో చికిత్స అందించి వైరస్‌ వ్యాప్తిని అరికట్టారు.. 

ఏపీలో అధిక టెస్టులు.. ఇప్పటి వరకు 74,551.. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంతగా రోజుకు 1,396 టెస్టులు, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లు అనిపిస్తున్నా.. దక్షిణ కొరియాలో మాదిరిగానే వైరస్‌ వ్యాప్తి అదుపులోకొస్తుందని, త్వరలోనే కేసులూ తగ్గుతాయని అంటున్నారు  

 సాక్షి, అమరావతి: కరోనాను అరికట్టడంలో ప్రపంచ దేశాలన్నీ దక్షిణ కొరియా వైపు చూస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ను లాక్‌డౌన్‌ లేకుండా అరికట్టడంలో విజయం సాధించడమే ఇందుకు కారణం. ఇందుకు ఆ దేశం పాటించిన విధానం ‘టెస్ట్ట్‌’. కరోనా ఉన్న వ్యక్తి, అతని కాంటాక్టులను సాంకేతికతతో  గుర్తించి, టెస్టులు చేసి స్వల్ప కాలంలోనే కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు ఇదే విధానాన్ని మన రాష్ట్రం కూడా అవలంబిస్తోందని కోవిడ్‌–19 నోడల్‌ ఆఫీసర్‌ జె.సుబ్రమణ్యం చెబుతున్నారు.

దక్షిణ కొరియాలో ఇలా..
► తొలి కేసు జనవరి 19న నమోదయ్యింది.
► ఫిబ్రవరి 18 వరకు కేవలం 30 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాత కేవలం పది రోజుల్లోనే 2,300కు పెరిగిన కేసుల సంఖ్య.
► దీనికి కారణం 31వ షేషెంట్‌ అనేకమంది వ్యాప్తి చేయడమే.
► దీంతో అప్రమత్తమై వైరస్‌ విస్తరణ కంటే వేగంగా టెస్టులు చేయాలని నిర్ణయం. 
► ఇందుకోసం డెబిట్‌ కార్డులు, సెల్‌ ఫోన్, సీసీ కెమెరాల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో కాంటాక్ట్‌ వ్యక్తులందరికీ పరీక్షలు నిర్వహించింది.
► టెస్టుల సంఖ్య పెంచడంతో ఒకే రోజు ఏకంగా 800 పైగా కేసులు నమోదయ్యేవి. పాజిటివ్‌ వచ్చినవారిని క్వారంటైన్‌ చేసి చికిత్స అందించింది.
► మార్చి నెలాఖరుకల్లా కరోనా అదుపులోకి వచ్చింది.
► కేసుల సంఖ్య 100కి పడిపోయి, ఇప్పుడు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. 

మన రాష్ట్రంలో ఇలా..
► రాష్ట్రంలో మార్చి 12న తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.
► తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన వారితో వైరస్‌ విజృంభించింది.
► అప్రమత్తమైన ప్రభుత్వం ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, వారితోపాటు ప్రయాణించిన వారి వివరాలు సేకరించి, క్వారంటైన్‌కు పంపి టెస్టులు నిర్వహించింది.
► రాష్ట్రంలో టెస్టు కిట్ల తయారీకి తోడు దక్షిణ కొరియా నుంచి కిట్లు దిగుమతి చేసుకుంది.
► వైరస్‌ వచ్చిన వారి ఫస్ట్‌ కాంటాక్ట్‌తో పాటు, వారు కలిసిన అందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది.
► ఒక మండలంలో నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదు అయితే రెడ్‌ జోన్‌గా ప్రకటించి కట్టడి చేస్తోంది.
► రెడ్‌ జోన్లో ఉన్న అనుమానితులను వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది.
► ఫలితంగా ప్రస్తుతం కరోనా వైరస్‌ కొత్త ప్రాంతాలకు విస్తరించడం తగ్గింది.
► కంటెయిన్మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో విరివిగా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ వ్యక్తులను త్వరగా గుర్తించి వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
► ఈ విధానం ద్వారా మే నెలలో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పూర్తి అదుపులోకి వస్తుందని అంచనా.

మరిన్ని వార్తలు