అమరావతి రైతులకు వరాలు

21 Jan, 2020 05:35 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించింది. అన్నదాతల సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అసెంబ్లీలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ) బిల్లును సభ ముందుంచారు. అమరావతి ప్రాంత ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలన్నీ స్పష్టం చేశారు.  

అసైన్డ్‌ రైతులకూ ప్లాట్లు  
అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని(పెన్షన్‌) రూ.2,500 నుంచి ఏకంగా రూ.5 వేలకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఈ పెన్షన్‌ పెంపువల్ల ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ.5.2 కోట్లు, ఏడాదికి రూ.60.30 కోట్ల భారం పడనుంది. 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వనున్నట్లు సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్నారు. జరీబు భూమి ఏకరానికి రూ.50 వేలు, మెట్ట భూమి ఎకరానికి రూ.30 వేల చొప్పున కౌలు  ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతిఏటా జరీబు భూములకు రూ.5 వేలు, మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున కౌలు పెంచనున్నారు. ఈ కౌలు వ్యవధిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తరువాత జరీబు భూమికి ఎకరాకు రూ.లక్ష, మెట్ట భూమికి ఎకరాకు రూ.60 వేల చొప్పున ఇవ్వనున్నారు. 29 గ్రామాల్లో  28,586 మంది రైతులు 34,385.275 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరంతా పదేళ్ల తర్వాత కూడా లబ్ధి పొందనున్నారు. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన వారికి కూడా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించనుంది.   

 ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటాం 
‘‘గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూములకు తక్కువ ప్యాకేజీ, పట్టా భూములకు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి దళిత రైతుల పట్ల వివక్ష చూపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి అసైన్డ్‌ రైతులకు కూడా పట్టా భూముల రైతులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’’  
– సలివేంద్రం జార్జి, అసైన్డ్‌ రైతు, వెలగపూడి   
 
రైతు కూలీల జీవితాల్లో వెలుగులు  
‘‘అమరావతిని రాజధానిగా ప్రకటించాక ఇక్కడ పొలాలు లేకపోవడంతో మాకు పనులు దొరకలేదు. భూములు లేని నిరుపేద రైతు కూలీలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2500 చొప్పున మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ భృతిని రూ.5 వేలకు పెంచడం సంతోషంగా ఉంది. రైతు కూలీల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపుతున్నారు’’  
– రాయపూడి చెంచు, నిరుపేద రైతు కూలీ, వెలగపూడి  

మరిన్ని వార్తలు