వాటర్‌ గ్రిడ్‌కు అధిక నిధులివ్వండి

10 Feb, 2020 04:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు కేంద్ర మంత్రిని కలసి విజ్ఞప్తి చేయనున్న ప్రతినిధుల బృందం

ప్రతి ఇంటికీ కుళాయి వసతికి ‘జల జీవన్‌ మిషన్‌’ పేరుతో కేంద్రం కొత్త పథకం

అంతకుముందే వాటర్‌గ్రిడ్‌ పేరుతో పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం

ఇందుకోసం రూ. 49,938 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా

కేంద్ర పథకంలో భాగంగా ఎక్కువ నిధులు రాష్ట్రానికి కేటాయించాలని కోరనున్న అధికారులు

సాక్షి, అమరావతి: ప్రతి ఇంటిలో మంచి నీటి కొళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేసి 365 రోజుల పాటు నీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలసి వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, వాటర్‌ గ్రిడ్‌ ఇన్‌చార్జి ఎండీ గిరిజా శంకర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌చార్జి ఈఎన్‌సీ కృష్ణారెడ్డిలు సోమవారం కేంద్రమంత్రిని కలుస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి ఏర్పాటు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్తగా ‘జల జీవన్‌ మిషన్‌’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అవసరమయ్యే నిధులను కేంద్రం– రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమకూర్చుకోవాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్రం ప్రారంభించిన జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం లాంటి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందే వాటర్‌ గ్రిడ్‌ పథకానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని అధికారుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుకు జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది.  

వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా ప్రణాళికలు.. 
వాటర్‌ గ్రిడ్‌ పథకం అమలుకు మొత్తం రూ. 49,938 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతి వేసవిలోనూ నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు సాగునీటి రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపుల ద్వారా మంచినీటి పథకాలకు నీటి సరఫరా జరిగేలా ఈ వాటర్‌ గ్రిడ్‌ను డిజైన్‌ చేశారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గుట్టు గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికీ రోజుకి వంద లీటర్ల చొప్పున, మున్సిపాలిటీలో 135 లీటర్ల చొప్పున, నగరాల్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి సరఫరాకు వీలుగా మొత్తం వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 2020–21 సంవత్సరంలో రూ. 8,040 కోట్లు, 2021–22లో రూ. 11,166 కోట్లు, 2022–23లో రూ. 13,409 కోట్లు, 2023–24లో రూ. 17,323 కోట్ల చొప్పున ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు.  

మరిన్ని వార్తలు