‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’లో నూతన శకం

16 Jul, 2020 03:47 IST|Sakshi

వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే పథకం పరిధిలోకి విస్తరించిన ఆరోగ్యశ్రీ 

మరో ఆరు జిల్లాలకు వర్తింపు

నేడు క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే పథకం వర్తింప చేయటాన్ని మరో ఆరు జిల్లాల్లో అమలు చేయనుంది. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో తాజాగా ఇది అమలులోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు.

► వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు.

► ఆరోగ్యశ్రీలో గతంలో 1,059 జబ్బులకే చికిత్స అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి వ్యాధులను చేర్చి మొత్తం 2,059 వ్యాధులను పథకం పరిధిలోకి తెచ్చింది.  

► పైలట్‌ ప్రాజెక్టు అమలు సమయంలో గుర్తించిన అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేస్తూ మరింత పటిష్టంగాఆరోగ్యశ్రీ అమలు చేసేలా విధివిధానాలు రూపొందించారు. ఈ క్రమంలో పథకం కింద వైద్య చికిత్సలను 2,146కు పెంచారు. 

► అనంతరం సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్స కోసం మరో 54 వైద్య ప్రక్రియలు చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే వైద్య ప్రక్రియల సంఖ్య మొత్తం 2,200కు చేరింది. 

► రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్‌ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు