కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే పెండింగ్‌ బిల్లులు చెల్లించం

1 Apr, 2020 04:37 IST|Sakshi

సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

లాక్‌ డౌన్‌ సమయంలో ఏ ఒక్క కార్మికుడినీ తొలగించకూడదని ఆదేశం

సాక్షి, అమరావతి: లాక్‌ డౌన్‌ సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించినా, పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించకపోయినా, కార్మికుల కాలనీలను పరిశుభ్రంగా ఉంచకపోయినా, ఆహారం అందించకపోయినా పెండింగ్‌ బిల్లులు చెల్లించబోమని కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయని కాంట్రాక్టర్లపై కార్మిక, అంటువ్యాధుల నియంత్రణ చట్టాల కింద కఠినచర్యలు తీసుకోవాలని సీఈలను ఆదేశిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

► రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న 7,233 మంది కార్మికులు, ఆ ప్రాజెక్టుల సమీపంలోనే 62 కాలనీల్లో నివాసం ఉంటున్నారు.  
► ఒక్క పోలవరం ప్రాజెక్టు పనుల్లోనే 5,078 మంది కార్మికులు ఉన్నారు.  
కరోనా వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  
► లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్‌ వద్ద రెగ్యులర్‌గాగానీ, అవుట్‌ సోర్సింగ్‌లోగానీ పనులు చేస్తున్న ఒక్క కార్మికుడినీ తొలగించకూడదని జలవనరుల శాఖ సూచించింది.  
► కార్మికుల కాలనీలను డీఎంహెచ్‌వోల ద్వారా తనిఖీలు చేయించి, వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందజేయాలని సీఈలను ఆదేశించింది.  
► పనులు చేసే ప్రదేశంలో భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.  
► కార్మికుల సంక్షేమానికి సర్కార్‌ జారీ చేసిన మార్గదర్శకాలను కాంట్రాక్టర్లు అమలు చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సీఈలకు సూచించింది. 
► మార్గదర్శకాలను అమలు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు