‘ఉపాధి’ పథకానికి రూ.8,791 కోట్లు కేటాయించండి

15 Feb, 2020 03:39 IST|Sakshi

కేంద్రాన్ని కోరనున్న ఆంధ్రప్రదేశ్‌

సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు రూ.8,791.65 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చే ఆర్థిక ఏడాదికి.. ఏ రాష్ట్రంలో ఎంత మంది కూలీలకు ఉపాధి కల్పిస్తారనే దానిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల వారీగా ఈ నెల 12 నుంచి వచ్చే నెల 2 వరకు వేర్వేరుగా సమావేశాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా మన రాష్ట్ర అధికారులతో ఈ నెల 26న కేంద్ర అధికారులు సమావేశం కానున్నారు. ఇందులో రాష్ట్రంలో నిరుపేద కూలీలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే ఏడాది (2021) మార్చి 31 మధ్య కాలంలో 25 కోట్ల పనిదినాలపాటు కూలీ పనులు కల్పించడానికి, కూలీలకు వేతనాలుగా చెల్లించేందుకు రూ.5,274.99 కోట్లు.. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో మెటీరియల్‌ కొనుగోళ్లకు మరో రూ.3,516.66 కోట్లు కేటాయించాలని కోరనున్నారు.   

మరిన్ని వార్తలు