గ్రామాలకు వైభవం

19 Jul, 2020 03:13 IST|Sakshi

ఏడాదిలోనే రూ. 11,192 కోట్లతో మౌలిక వసతులు 

గత ప్రభుత్వంలో పెండింగ్‌ ఉన్నవి కలిపితే రూ.15 వేల కోట్లపైనే అభివృద్ధి పనులు

సరైన రోడ్లు లేని గ్రామాలకు కొత్తగా రోడ్లు మంజూరు 

3,285 కి.మీ. పనులకు అనుమతి 

జూలై నెలాఖరు కల్లా చాలా చోట్ల పనులు మొదలు 

రూ.2,245 కోట్లతో పల్లెల్లో 10 వేలకు పైగా హెల్త్‌ క్లినిక్‌ భవనాలు 

రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల భవనాలకు పెద్ద ఎత్తున అనుమతి

శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉండే జీరుపాలెం, జగన్నాథపురం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఎన్‌హెచ్‌–16 జాతీయ రహదారి నుంచి ఈ గ్రామాలను, రూ.8 కోట్లతో రణక్షేత్రం మండలంలోని 21 చిన్న, చిన్న గ్రామాలను కలుపుతూ 15 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

అనంతపురం జిల్లాలో సుమారు వెయ్యి జనాభా ఉండే రేకులకుంట గ్రామంలో ప్రస్తుతం రూ.79.30 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.40 లక్షలతో సచివాలయ భవనం, రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.17.50 లక్షలతో హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆరు నెలల కిందటే ఆ గ్రామంలో రూ.5 లక్షల వ్యయంతో సిమెంట్‌ రోడ్డు నిర్మించారు. 

సాక్షి, అమరావతి: ఏడాది కాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారానే రూ.11,192 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు వసతికి నోచుకోని చాలా గ్రామాలకు కొత్తగా తారు రోడ్లను మంజూరు చేసింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో రోడ్డు వేయడానికి ఇంకొన్ని చోట్ల అనుమతిచ్చింది. చాలా గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌ భవనం, రైతు భరోసా  కేంద్రం నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకొని గత ప్రభుత్వం ఎన్నికలకు ముం దు అనుమతిచ్చిన రూ.4,404 కోట్ల రోడ్ల పనులనూ కలుపుకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లకు పైబడి ఒక పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా అభివృద్ధి పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. 

ఏడాది కాలంలో కొత్తగా మంజూరు చేసిన పనులివే.. 
► మారుమూల గ్రామాలను, వాటికి సమీపంలోని పెద్ద గ్రామం లేదా పట్టణానికి కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కి.మీ. పొడవునా కొత్తగా రోడ్డు నిర్మాణ పనులకు గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ పనులకు మొత్తం రూ.1,950 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2,214 కి.మీ. పొడవునా 284 పనులు గుర్తించి, ఇప్పటికే టెండరు ప్రక్రియను మొదలుపెట్టారు.  
► రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్‌ ఆఫ్‌ లెఫ్ట్‌ వింగ్‌ ఎఫెక్టెడ్‌ ఏరియాస్‌ పథకంలో భాగంగా మరో రూ.755 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది.  
► రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,356 కోట్ల వ్యయంతో 10,876 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణానికి ప్రభు త్వం అనుమతి తెలపగా.. ఇప్పటికే దా దాపు అన్ని పనులు మొదలయ్యాయి. దాదాపు 127 చోట్ల పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 
► గ్రామాల్లో  వైద్య సేవలందించడానికి రూ.2,245 కోట్ల వ్యయంతో 10,062 గ్రామాల్లో హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణానికి  అనుమతి తెలపగా, 802 చోట్ల ఆయా భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 
► 8,567 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.1,511 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రస్తుతం 506 గ్రామాల్లో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.  
► అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి రూ.375 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతి తెలిపింది.  

పంచాయతీ భవనం లేకుంటే రూ.80 లక్షల పనులు 
పంచాయతీ భవనం కూడా లేని మా గ్రా మానికి హెల్త్‌ క్లినిక్‌ భవనం, రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఏడాది కాలంలో దాదాపు రూ.80 లక్షల విలువ చేసే పనులు మా ఊరులో మొదలయ్యాయి.  
– సాకే లక్ష్మినారాయణ, రేకులకుంట, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా 

పనులన్నీ ప్రారంభం 
గ్రామీణ ప్రాం తాల్లోని ప్రతి నివాసిత ప్రాం తానికి రోడ్డు వసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ భవనాలను నిర్మించాలన్నది ఈ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు. అందుకనుగుణంగా ఆయా పనుల్లో  మూడో వంతు ఇప్పటికే మొదలయ్యాయి.  
– సుబ్బారెడ్డి, ఈఎన్‌సీ,పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం 

మరిన్ని వార్తలు