ఇసుక.. ఇంటికే వచ్చేస్తుందిక

3 Feb, 2020 04:44 IST|Sakshi

ఈనెల 14 నాటికి రాష్ట్రమంతటా విస్తరణ

ఇప్పటికే ఆరు జిల్లాల్లో విజయవంతంగా అమలు

ఇప్పటివరకూ 1.80 లక్షల టన్నుల సరఫరా

రవాణా చార్జీలు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం జిల్లాల అధికారులతో సమీక్షలు

సాక్షి, అమరావతి: అడిగిన వారి ఇంటికే నేరుగా ఇసుక సరఫరా (డోర్‌ డెలివరీ) విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే ఆరు జిల్లాల్లో ఇసుకను డోర్‌ డెలివరీ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) విజయవంతంగా అమలు చేస్తోంది. త్వరలో ఈ విధానాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. రవాణా చార్జీల ఖరారు, ఇసుక వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లాస్థాయి ఇసుక కమిటీల (డీఎల్‌ఎస్‌సీ)తో ఏపీఎండీసీ అధికారులు నిత్యం సమీక్షిస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రవాణా అధికారులతో కూడిన డీఎల్‌ఎస్సీ ప్రతినిధులు ఇసుక రవాణా చార్జీల ఖరారుకు సంబంధించి లారీ, ట్రాక్టర్‌ యజమానుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. 

6 జిల్లాల్లో విజయవంతంగా అమలు
ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఇసుకను డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డోర్‌ డెలివరీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఏపీఎండీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, 14వ తేదీనుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో  నూతన విధానం అమలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇప్పటికే 1.80 లక్షల టన్నుల ఇసుక డోర్‌ డెలివరీ
ఆరు జిల్లాల్లో ఇప్పటికే 1.80 లక్షల టన్నుల ఇసుకను డోర్‌ డెలివరీ చేశాం. కేవలం నెల రోజుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 1.06 లక్షల టన్నుల ఇసుక డోర్‌ డెలివరీ చేశాం. కొత్త విధానం విజయవంతం అయ్యిందనడానికి ఇది నిదర్శనం. ఈనెల 14వ తేదీకల్లా రాష్ట్రమంతా దీనిని అమల్లోకి తెస్తాం. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారి ఇంటికి ఇసుక చేరవేసిన వాహన యజమానులకు ప్రస్తుతం 48 గంటల్లో రవాణా చార్జీలు చెల్లిస్తున్నాం. ఇకపై 24 గంటల్లోనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– మధుసూధన్‌రెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా