పౌల్ట్రీకి మంచి రోజులు

11 Apr, 2020 03:45 IST|Sakshi

గడ్డుకాలంలో సర్కార్‌ చేయూత

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్, కరోనా వైరస్‌పై వెల్లువెత్తిన వదంతుల వల్ల తీవ్రంగా నష్టపోయిన కోళ్ల పెంపకందారులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నెమ్మదిగా కోలుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో దెబ్బమీద దెబ్బ తగలడంతో పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోయింది. కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే పుకార్లు పౌల్ట్రీ రంగాన్ని కుంగదీస్తే లాక్‌డౌన్‌ వల్ల దాణా, ముడిపదార్ధాలు రైతులకు సకాలంలో అందలేదు. కోళ్లు, గుడ్లను కొనేవారు లేక పౌల్ట్రీ అనుబంధ సంస్ధలు, కార్మికుల ఆర్ధిక పరిస్ధితులు ఛిన్నాభిన్నం అయ్యాయి.

ఈ తరుణంలో ఒకవైపు కోవిడ్‌–19 నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే పౌల్ట్రీ రంగానికి చేయూత నిచ్చేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తుండటంతో గుడ్లు, మాంసం విక్రయాలు క్రమంగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6.6 కోట్ల గుడ్లను పెట్టే కోళ్లు, 23 కోట్ల బ్రాయిలర్‌ కోళ్లున్నాయి. ఏటా 1,975 కోట్ల గుడ్లు, 444 వేల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. కోడి మాంసం, గుడ్లు తినడం వలన కరోనా వైరస్‌ వస్తుందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో జనవరి, ఫిబ్రవరిలో వీటి వినియోగం పూర్తిగా పడిపోయింది.  

► కోడి మాంసం, గుడ్లను తినడం వలన కరోనా సోకదని ప్రచార మాధ్యమాల ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వం అవగాహన కల్పించింది.  
► అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలు, గర్భిణీ, మహిళలకు ఇంటికి సరఫరా చేస్తున్న రేషన్‌లో కూరగాయలకు బదులు గుడ్లను అందిస్తూ వీటి వినియోగాన్ని పెంచింది. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 2.80 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 3.70 లక్షల మంది బాలింతలు, 8.70 లక్షల మంది పిల్లలున్నారు. వీరందరికీ రోజుకు 2 గుడ్ల చొప్పున 30.60 లక్షల గుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది.  
► కోళ్లు, గుడ్ల రవాణాలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిరంతరం పనిచేసే మానిటరింగ్‌ వ్యవస్ధను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమల్లో పనిచేసే 1,100 మంది కార్మికులు, 165 వాహనాలకు ఇబ్బంది లేకుండా గుడ్లు, దాణా రవాణా చేసేందుకు పాస్‌ల ద్వారా అనుమతి ఇచ్చింది.  
► పశు సంవర్ధకశాఖ 8500001963  నంబరుతో హెల్ప్‌లైన్‌  ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 13 జిల్లాల్లో పశు సంవర్ధశాఖ జాయింట్‌ డైరెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించింది. 

మరిన్ని వార్తలు