63 లక్షల మందికి ‘ఉపాధి’

14 Jun, 2020 04:41 IST|Sakshi
కృష్ణా జిల్లా నున్నలో ఉపాధి పనులు చేస్తున్న స్థానికులు

పేద కుటుంబాలను ఉపాధి హామీ పథకంతో ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం

అందరికీ కలిపి 10.33 కోట్ల పని దినాలు 

దేశంలోనే నంబర్‌ వన్‌గా ఏపీ 

కరోనా కాలంలో రూ.20 వేలకుపైగా ఆదాయం పొందిన పేదలు 

వేతనాల రూపంలో రూ.2,380 కోట్ల చెల్లింపు 

రోజూ 50 లక్షల మందికి పైగా కూలీలకు పని కల్పన

ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతటా ఇబ్బందులే. అలాంటి సమయంలోనూ ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన ఓబినేనిపల్లెకు చెందిన ఇద్దరు సభ్యులున్న బండ్లమూడి బాలవర్దన్‌రాజు కుటుంబం ఉపాధి హమీ పథకం పనులు చేసుకుని ఆ రెండు నెలల్లో రూ.24,261 సంపాదించుకున్నారు. అదే గ్రామంలోని 242 కుటుంబాలు ఆ రెండు నెలలూ ఉపాధి హామీ పనులు చేసి దాదాపు రూ.39 లక్షలు సంపాదించుకున్నాయి.

సాక్షి, అమరావతి:  దేశమంతా కరోనాతో విలవిల్లాడుతున్న వేళ కూడా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 63.29 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పథకం పనులు చేయటం ద్వారా రూ.2,380 కోట్లు సంపాదించుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విపత్తు సమయంలో ఉపాధి హామీ పథకం పనులను భారీగా పెంచడంతో గడచిన రెండున్నర నెలల్లో 39 లక్షల కుటుంబాలు ఉపాధి పొందాయి. ప్రస్తుతం ప్రతి రోజూ 50 లక్షల మందికి పైగా పేదలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. వారిలో 83.66 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలు కావడం గమనార్హం. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. 

రోజుకు రూ.230 వేతనం 
► ఉపాధి పనులకు హాజరయ్యే వారికి రోజుకు రూ.230 చొప్పున వేతనంగా అందుతోంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 70 రోజుల వ్యవధిలో పేదలకు 10.33 కోట్ల పని దినాలను ప్రభుత్వం కల్పించింది. 
► రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 5,017 గ్రామాల్లో  రెండున్నర నెలల్లో రూ.20 లక్షలకు పైబడి విలువ గల ఉపాధి హామీ పనులు జరిగాయి. మరో 3,935 గ్రామాల్లో రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య విలువ చేసే పనులు జరిగాయి. ఇంకో 2,066 గ్రామాల్లో రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల మధ్య విలువ చేసే పనులు జరిగాయి.  
► తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గడచిన ఐదేళ్లలో ఏ ఒక్క రోజు 35 లక్షల మంది కూలీలకు మించి ఉపాధి హామీ పనులు కల్పించిన దాఖలాలు లేవు. 
► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూలీలకు భారీగా పనులు కల్పించడంపైనే దృష్టి పెట్టడంతో ఈ నెల 8వ తేదీన ఒక్క రోజే 54.14 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు.  
► శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,264 మంది కూలీలు హాజరైనట్టు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. 

దేశంలో మన రాష్ట్రమే ఫస్ట్‌ 
► లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.48 కోట్ల మంది కూలీలకు ఏప్రిల్, మే, ప్రస్తుత జూన్‌ నెలల్లో పనులు కల్పిస్తే.. మన రాష్ట్రంలో 63.29 లక్షల మంది పనులకు హాజరయ్యారు. 
► దేశవ్యాప్తంగా కూలీలకు రూ.13,415 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తే, మన రాష్ట్రంలో రూ.2,380 కోట్లను వేతనాలుగా చెల్లించారు.  

లాక్‌డౌన్‌ సమయంలోనూ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరు..  

మరిన్ని వార్తలు