ఇసుక రాజకీయం

28 Dec, 2014 02:13 IST|Sakshi
ఇసుక రాజకీయం

* రీచ్‌ల నిర్వహణలో డ్వాక్రా మహిళలకు సర్కారు సహాయ నిరాకరణ
* నాలుగు నెలలు అవుతున్నా ఇస్తానన్న పెట్టుబడీ లేదు, మహిళలకు శిక్షణా లేదు
* ఇసుక రీచ్‌ల నిర్వహణ ఖర్చులు కూడా ఇప్పటి వరకూ విడుదల చేయని వైనం
* ఇసుక విక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టే వ్యవస్థ ఏర్పాట్లలోనూ అలసత్వం
* ప్రభుత్వమే రీచ్‌లను నిర్వహిస్తుండటంతో ఆ వైపే చూడని విజిలెన్స్ విభాగం
* పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్న వ్యాపారం
* డ్వాక్రా మహిళలు విఫలమయ్యారంటూ.. టీడీపీ నేతల చేతుల్లో రీచ్‌లకు ఎత్తుగడ?

 
సాక్షి, హైదరాబాద్: కుక్కను చంపాలంటే ముందు ఆ కుక్క పిచ్చిదన్న ముద్ర వేయాలి..! రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అచ్చం ఇదే సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబే ఇప్పుడు వారు సమర్థవంతంగా ఈ వ్యవహారాలు చేయలేకపోతున్నారని చిత్రీకరించి మొత్తం ఇసుక వ్యాపారాన్ని తమ పార్టీ నేతల చేతుల్లో పెట్టడానికి పావులు కదుపుతున్నారని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
 
నాలుగు నెలల కిందట తాను తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపకపోతుండడంతో అటు డ్వాక్రా మహిళా సంఘాల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించాలని నిర్ణ యం తీసుకున్న ప్రభుత్వం, అందుకు సంబంధించి ఏ విషయంలోనూ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదు.
 
ఇసుక అక్రమాలకు సర్కారు ఊతం...
చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం అమలులో ఆయన డొల్లతనం బయటపడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను మెప్పించేం దుకు.. ఇసుక విధానంలో పొందుపరిచిన నిబంధనల అమలును ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టేసింది. శనివారం నాటికి రాష్ట్రంలో 209 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించగాా.. అందులో 193 రీచ్‌లలో ఇసుక అమ్మకాలు మొదలయ్యాయి. దాదాపు 12 వేల డ్వాక్రా గ్రూపులు ప్రాతినిధ్యం వహించే 550 గ్రామ సమైక్య సంఘాలకు ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కొత్త ఇసుక విధానం ఇసుక వ్యాపారం జరిపే తీరుపై గానీ, విధానంలో పొందుపరిచిన నియ మ నిబంధనలపై గానీ ఇప్పటి వరకు ఏ ఒక్క డ్వాక్రా సంఘ సభ్యురాలికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించలేదు. ఒక్కొక్క ఇసుక రీచ్ నిర్వహణకు ఐదేసి లక్షల రూపాయలు ఏపీఎండీసీ ద్వారా ప్రభత్వం నిధులు ఇస్తుందని కొత్త విధానంలో స్పష్టంగా పేర్కొని.. అమలులో పక్కన పెట్టింది.
 
బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలోనూ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో.. రీచ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డ్వాక్రా మహిళలు పెట్టుబడి స్థానిక నేతలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక అధికార పార్టీ నేతలు డ్వాక్రా మహిళలకు పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారంలోకి పరోక్షంగా చొచ్చుకొచ్చారు. ఇప్పుడు పేరుకు డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక వ్యాపారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దాదాపు అన్ని రీచ్‌లలోనూ, స్టాక్ పాయింట్‌ల వద్ద టీడీపీ నేతలకు అనుకూలంగా ఉండేవారే పనిచేస్తున్నారు.
 
 ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలేవీ?
 డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించే ఇసుక వ్యాపారంలో అక్రమాలకు తావు లేకుండా రీచ్‌ల వద్ద, స్టాక్ పాయింట్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటల పాటు అక్కడి వ్యవహారాలను రికార్డు చేస్తామని.. రాత్రి వేళ రీచ్‌లోనూ, స్టాక్ పాయింట్ వద్ద పటిష్టమైన పహారా నిర్వహిస్తామని.. స్టాక్ పాయింట్‌ల వద్ద ఇసుక లోడ్ చేసిన వాహనం, వే బిల్లు, ఇసుక చేరవేసే ప్రదేశం వంటి వివరాలను స్థానిక పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులకు నిమిషాల వ్యవధిలో చేరవేయటం ద్వారా అక్రమ రవాణాను అరికడతామని.. కొత్త ఇసుక విధానంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం అమలులోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ఇసుక రీచ్‌లోనూ, స్టాక్ పాయింట్ వద్దా సీసీ కెమోరాల ఏర్పాటు జరగలేదు. గుంటూరు జిల్లాలో కొన్నింటి వద్ద ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేసింది. పెలైట్ ప్రాజెక్టుగా ఆ ఆరు చోట్ల దీనిని అమలు చేసి, అక్కడి పర్యవసానాల ఆధారంలో తరువాత మిగతా చోట్ల  విస్తరించాలన్నది అధికారుల ఆలోచన.
 
 సంఘాలకు ఇచ్చేది మూడు రూపాయలే...
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక వ్యాపారం చేస్తే ప్రతి క్యూబిక్ మీటర్ అమ్మకానికి రూ. 3 మాత్రమే రీచ్‌లను నిర్వహించే మహిళా సంఘాలకు దక్కుతుంది. వినియోగదారుడికి క్యూబిక్ మీటర్ ఇసుక రూ. 650 వరకు ప్రభుత్వం అమ్ముతున్నప్పటికీ ప్రతి క్యూబిక్ మీటర్ అమ్మకంపై రూ. 15 అక్కడ పనిచేసే ఉద్యోగుల జీతాల కోసం, రీచ్ ఉన్న గ్రామంలో ఉండే మహిళా సంఘాలన్నింటికీ కలిపి రూ. 3 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ కారణంగా రీచ్‌లో అక్రమాలకు ఆస్కారమేర్పడుతోంది.  
 
 సంక్షిప్తంగా రీచ్‌ల సమాచారం..
 - రాష్ట్రంలో అందు బాటులో ఉన్న ఇసుక పరిమాణం: 1,64,21,013 క్యూబిక్ మీటర్లు
 - ప్రభుత్వం ఆశించిన ఆదాయం (ఏడాదికి): రూ. 2,500 కోట్లు  
 - గనులశాఖ అంచనాల ప్రకారం ప్రతి నెలా అమ్మకాలకు అవకాశం: 15-25 లక్షల క్యూబిక్ మీటర్లు
 - కొత్త ఇసుక విధానంలో నాలుగు నెలల్లో అమ్మకాలు జరిగిన ఇసుక పరిమాణం: 15,96,497 క్యూబిక్ మీటర్లు (శనివారం నాటికి)
 - సెప్టెంబరులో మొదలైనా నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఈ విధానంలో ఎక్కువ అమ్మకాలు జరిగాయి
 - గత వారం రోజులుగా రోజు వారీ అమ్మకాల సరాసరి: రోజుకు 37 వేల క్యూబిక్ మీటర్లు
 - కొత్త విధానంలో శనివారం నాటికి అమ్మకాల విలువ: రూ. 106.03 కోట్లు
 
 రాత్రి వేళ ఇసుక తోడేస్తున్న తోడేళ్లు...
 మరోపక్క.. ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద రాత్రి వేళ కాపలాదారులను నియమిం చేకునే బాధ్యతను ప్రభత్వుం ఆయా రీచ్‌ల ను నిర్వహించే డ్వాక్రా సంఘాలకే  అప్పగిం చారు. దీంతో పరోక్షంగా ఇసుక రీచ్‌లపై అధిపత్యం చెలాయిస్తున్న టీడీపీ నేతలు రాత్రి వేళ భారీగా ఇసుక తరలించుకొని పోతున్నారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల రాత్రి వేళ ఇసుకను తరలించే వాహనాలను పోలీసులు పట్టుకున్నప్పటికీ టీడీపీ నేతలు జోక్యం చేసుకొని విడిపించిన సంఘటనలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు