రబీ కోతలు సజావుగా సాగేందుకు చర్యలు

6 Apr, 2020 03:47 IST|Sakshi

సమస్యలుంటే 1907కు ఫోన్‌ చేయండి

మార్గదర్శకాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో రబీ పంటల కోతలు సజావుగా సాగేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదివారం పలు మార్గదర్శకాలు జారీచేస్తూ ఉత్తర్వులిచ్చారు. 
► వ్యవసాయ, ఉద్యాన పనులను మధ్యాహ్నం ఒంటిగంట వరకే చేయాలి.. ఈ మేరకు కూలీలను అనుమతించాలి.  
► కూలీలు భౌతిక దూరం పాటించేలా చూడాలి. 
► వ్యవసాయ, ఉద్యాన పనులకు, కోతలకు ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితర వ్యవసాయ పరికరాలకు, యంత్రాల రాకపోకలకు ఎటువంటి ఆంక్షల్లేవు. 
► వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల రవాణాతో పాటు.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల రవాణా, ఆక్వా ఫీడ్, ఆక్వా సీడ్స్, పశుగ్రాసం, మేతల రవాణాపైనా ఎటువంటి ఆంక్షల్లేవు. 
► ఎరువులు, పురుగు మందుల దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చు. భౌతిక దూరం పాటిస్తూ ఈ షాపుల వద్ద కొనుగోళ్లు చేయొచ్చు. 
► వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ఎక్కడికక్కడ సేకరించుకునేందుకు గ్రామాల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సహకరించాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులకు అవగాహన కల్పించాలి. 
► ఎక్కడైనా తక్కువ ధరలకు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుంటుంటే 1907కు ఫోన్‌చేసి చెప్పాలి. 
► ఈ వ్యవహారంలో మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యత వహించి ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాలి. 

>
మరిన్ని వార్తలు