ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఇంటికే ఇసుక

5 Jul, 2019 08:28 IST|Sakshi

వంశధార, నాగావళి నదుల్లో ఇసుక బాధ్యత ఏపీఎండీసీకే..

చిన్న నదుల ఇసుక ‘స్థానికులకు’ ఉచితమే

రవాణా వాహనాలకు జీపీఎస్‌ అమలు

సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): కొత్త ఇసుక విధానంపై స్పష్టత వచ్చేసింది. ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారానే ఇంటికి ఇసుక వచ్చే అధునాతన విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ పారదర్శక విధానాన్ని రానున్న సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారమే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో వినియోగ ప్రజలతోపాటు అధికారులకు కూడా గత ఇసుక బాధలు తీరినట్లేనని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇసుక మాఫియా దౌర్జన్యాలు లేకుండా పూర్తి సరళీకృత విధానంలో ఇసుకను నేరుగా ఇంటి వద్దకే అందించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.

ఇసుకతోపాటు రవాణా వాహనాలను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా సాంకేతికతను అమలు చేయనున్నారు. ఈ వాహనాలకు ప్రత్యేకంగా జీపీఎస్‌ను అమర్చనున్నారు. అలాగే ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఒక్క క్లిక్‌తో అటు ఇసుక మాఫియాకు.. ఇటు అక్రమాలకు చెక్‌ పెట్టేలా అడుగు పడనుంది. ఇదిలావుంటే రానున్న సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త పాలసీ అమలు కానున్న నేపథ్యంలో అంతవరకు జిల్లాలో ఇసుక వినియోగం, విక్రయాలపై పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

పెద్ద నదుల్లో ఇసుక బాధ్యతలు ఏపీఎండీసీకే..
జిల్లాలో పెద్ద నదుల వద్ద ఇసుక వినియోగంపై స్పష్టమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా పాలసీలో పేర్కొంది. ఈమేరకు 4వ ఆర్డర్‌ స్ట్రీమ్‌లో ఉన్న వంశధార, నాగావళి నదుల తీరంలోని ఇసుక తవ్వకాలు జరిపి, ప్రజలకు సరసమైన ధరకు విక్రయించే బాధ్యతలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృధ్ది సంస్థ (ఏపీఎండీసీ)కు అప్పగిస్తూ జగన్‌ సర్కార్‌ నూతన ఇసుక విధానాన్ని ప్రకటించింది.

వంశధార, నాగావళి నదుల్లో తవ్విన ఇసుకను ఆయా రీచ్‌లకు సమీపంలో స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేయనున్నారు. అలాగే జిల్లాలో చిన్న నదులైన మహేంద్ర తనయ, బాహుదా నదులు, చిన్న వాగులు, వంకలు నుంచి ఇసుక వినియోగం ఉచితం కానుంది. థర్డ్‌ ఆర్డర్‌ స్ట్రీమ్‌ కింద జిల్లాలో ఉన్న మహేంద్రతనయ, బాహుదా తదితర చిన్న నదులతోపాటు సువర్ణముఖి తదితర గెడ్డలు, వాగులు, వంకల వద్ద ఉన్న ఇసుకను మాత్రం ‘స్థానికులకు’ ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆయా నదీతీరాల్లో ఎటువంటి యంత్రాలను వినియోగించకుండా, ఆయా మండలాల పరిధి దాటి రవాణాకు అవకాశాలు ఇవ్వకుండా.. ఇసుకను స్థానికులు, ముఖ్యంగా పేద, సామాన్య వర్గాలకు మాత్రమే తమ సొంత గృహ నిర్మాణ అవసరాలకు తోడ్కొనేలా కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. అలాగే జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇసుక తరలింపు కోసం పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్‌ ఏరియాస్‌ (పీసా) చట్టం కచ్చితంగా అమలు కానుంది. ఇక్కడి ఇసుకపై పూర్తి హక్కులను స్థానిక గిరిజనులకు చెందిన సొసైటీలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

చౌకగా..సరళంగా అందేలా...!
గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘ఉచిత ఇసుక విధానం’తో.. కేవలం టీడీపీ నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసి, అక్రమంగా కోట్లు కూడబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా గత ప్రభుత్వ విధానాలతో నిత్యం అవస్థలు పడ్డ ప్రజలకు.. ప్రస్తుత జగన్‌ ప్రభుత్వంలో మాత్రం అలాంటి కష్టాలు లేకుండానే సరసమైన ధరకే ఇసుక చెంతకు వచ్చేలా కొత్త పాలసీని రంగంలోకి దించారు. ఇసుకను బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్, పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

దీంతో ఇసుక ఎంత అవసరమో..ఎక్కడికి..ఏ వాహనంలో చేర్చాలో..అన్న వివరాలతో ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌ చేసి, నిర్ణీత ధరను ఆన్‌లైన్లో చెల్లించగానే ఎంచక్కా మీ ఇంటికే నేరుగా చేరేలా అవకాశమొచ్చింది. ఈ ఇసుక నిల్వల కోసం ప్రత్యేకంగా రీచ్‌ల వద్ద స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు త్వరలోనే ధరలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు