సీమ కరువుకు ‘రాయలసీమ’తో చెక్‌

27 Feb, 2020 04:39 IST|Sakshi

శ్రీశైలంలో 854 అడుగులకు దిగువన నీటి నిల్వ ఉన్నా వినియోగానికి సర్కారు ప్రణాళిక

797 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు బీసీఆర్‌లోకి తరలించేలా ‘రాయలసీమ ఎత్తిపోతల’కు గ్రీన్‌సిగ్నల్‌

తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టుకు భరోసా

సాక్షి, అమరావతి: ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 854 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా సామర్థ్యం మేరకు నీటిని రాయలసీమకు తరలించవచ్చు. అంతకంటే నీటిమట్టం తగ్గితే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి వీలుండదు. దీనివల్ల రాయలసీమలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు.. తాగు, సాగునీటి సమస్యలను అధిగమించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకంటే దిగువకు చేరుకున్నా.. రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌(బీసీఆర్‌)లోకి ఎత్తిపోసి.. అక్కడినుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ద్వారా సాగు, తాగునీటి కష్టాలను అధిగమించే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఎత్తిపోతలకు రాయలసీమ ఎత్తిపోతలుగా నామకరణం చేసింది. దీనికి డీపీఆర్‌ తయారుచేయాలని జలవనరులశాఖను ప్రభుత్వం ఆదేశించింది. 

సీమను సుభిక్షం చేసేలా.. 
కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోతోంది. వరదను ఒడిసిపట్టి.. శ్రీశైలంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపే స్థాయిలో కాలువల సామర్థ్యాన్ని పెంచే పనులను గత సర్కారు చేపట్టలేదు. దీనివల్ల ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి 1,782 టీఎంసీల వరద వచ్చినా ఒడిసి పట్టలేకపోయాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 801 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరదొచ్చే 40 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులను నింపడానికి రూ.33,869 కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రణాళికను అమలు చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు శ్రీశైలంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించేలా ముచ్చుమర్రి నుంచి ఎత్తిపోసి.. 42 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్‌ ద్వారా బీసీఆర్‌లోకి నీటిని తరలిస్తారు. అక్కడినుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు సరఫరా చేస్తారు. కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు తాగు, సాగునీటిని ఈ ఎత్తిపోతల ద్వారా అందిస్తారు. దీనికి రూ.3,890 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా.

ఆయకట్టుకు భరోసా..
ప్రస్తుతం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తెలుగుగంగ కింద 5.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఎస్సార్బీసీ కింద వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలు, కేసీ కెనాల్‌ కింద 2.65 లక్షల ఎకరాలు వెరసి ఈ మూడు ప్రాజెక్టుల కింద 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. గాలేరు–నగరి కింద మరో 2.60 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తాగునీళ్ల కోసం కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో శ్రీశైలం నుంచి కనీస నీటిమట్టానికి దిగువనున్న జలాలను తరలించి.. సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి వీలవుతుంది.  

మరిన్ని వార్తలు