మద్య నియంత్రణతో.. మార్పు వైపు 

16 Jun, 2020 03:20 IST|Sakshi

కుటుంబాల్లో ఆర్థిక స్థితి మెరుగుపడింది

75 శాతం ధరల పెంపుతో గణనీయంగా తగ్గిన వినియోగం

గతంతో పోలిస్తే తగ్గిన డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు

దశల వారీ నియంత్రణతో ఏడాదిలోనే సత్ఫలితాలు 

ఈమె గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన చేపల అంజమ్మ. మద్య నియంత్రణకు ముందు తమ గ్రామంలో అడుగుకో బెల్టుషాపు ఉండేదని.. తన భర్త సంపాదనంతా తాగుడికే ఖర్చుచేసే వాడని చెబుతోంది. కానీ, ఇప్పుడు మద్యం అందకుండా పోవడంతో అతను కూలి డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో ఇస్తున్నా డని సంతోషంతో చెబుతోంది. ఇలా ఒక్క అంజమ్మ ఇంట్లోనే కాదు.. ప్రతి పేద మహిళ ఇంట్లోనూ మద్య నియంత్రణ ఆర్థిక స్థితిగతులను మార్చింది. 

సాక్షి, అమరావతి: మద్యం ప్రియుల్లో మార్పు మొదలైంది. నవరత్నాల్లో ఒకటైన దశల వారీ మద్యం నియంత్రణకు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పేదల కుటుంబాల్లో ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఆదాయం కోసం కాకుండా ప్రజారోగ్యం కోసమే ఈ సర్కారు పనిచేస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ చేతల్లో చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్ట్‌ షాపులను తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాక.. మద్యం వినియోగాన్ని కూడా తగ్గించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తోంది. దీంతో పేదల కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. మద్యం వినియోగం తగ్గడంతో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. టీడీపీ హయాంలోని పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎలాగంటే.. 

► 2018 అక్టోబర్‌ నుండి 2019 మార్చి వరకు 191.79 లక్షల మద్యం కేసుల అమ్మకాలు జరగ్గా, 2019 అక్టోబర్‌ నుండి 2020 మార్చి వరకు 140.79 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే.. 23.46 శాతం అమ్మకాలు తగ్గాయి. 
► బీరు విషయానికొస్తే.. 2018 అక్టోబర్‌ నుండి 2019 మార్చి వరకు 131.46 లక్షల కేసులు అమ్ముడవగా.. 2019 అక్టోబర్‌ నుండి 2020 మార్చి వరకు కేవలం 51.85 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. అంటే.. 55.57 శాతం అమ్మకాలు తగ్గాయి.  
► లిక్కర్‌ షాపుల వద్ద టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన పర్మిట్‌ రూమ్‌లను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.  
► అప్పట్లో ఒక వ్యక్తికి గరిష్టంగా ఆరు మద్యం బాటిళ్లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఏదైనా మూడు మాత్రమే ఇస్తున్నారు.   
► చంద్రబాబు హయాంలో అర్ధరాత్రి వరకు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ఉ.11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. 
► వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం షాక్‌ కొట్టేలా మద్యం ధరలను 75 శాతం మేర భారీగా పెంచింది.  
► దీంతోపాటు బార్లను 40 శాతం తగ్గించింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి.   
► అలాగే, ఏపీ స్టేట్‌ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. 
► ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యంవల్ల ఎదురయ్యే దుష్ఫలితాలపై సర్కారు ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇందుకోసం మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటుచేసింది. 
► అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 15 డి–అడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. 
► అక్రమ మద్యాన్ని అన్ని రకాలుగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ను ఏర్పాటుచేసింది.  
► వార్డు వలంటీర్లతో పాటు గ్రామాల్లో నియమించిన మహిళా మిత్ర, మహిళా రక్షక్‌ల సేవలను ఇందుకు వినియోగించుకుంటోంది.

దశలవారీ మద్య నియంత్రణకు కట్టుబడ్డాం  
మా ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణకు కట్టుబడి ఉంది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకే సీఎం వైఎస్‌ జగన్‌ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. అసలు ప్రజలకు మద్యాన్ని అలవాటు చేసిందే చంద్రబాబు. లాక్‌డౌన్‌ కాలంలో అక్రమ మద్యం విక్రయాలకు టీడీపీ నేతలు పాల్పడ్డారు. చంద్రబాబు బంధువులు కూడా చిత్తూరులో మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు.   
– కళత్తూరు నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం 

గతంలో అమ్మకాలు పెంచేందుకు టార్గెట్లు 
గతంలో మద్యం అమ్మకాలు ఎలా పెంచాలా? అని ఎక్సైజ్‌ అధికారులకే టార్గెట్లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఎలా తగ్గించాలా? అని లక్ష్యాలు విధిస్తున్నాం. మద్యం షాపులు ఎక్కడ నుంచి తొలగించాలనే అంశంపైనే ఎక్సైజ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
– కేఎల్‌ భాస్కర్, ఎక్సైజ్‌ అదనపు కమిషనర్‌

మరిన్ని వార్తలు