పరిహారమా? పరిహాసమా?

23 Dec, 2017 04:07 IST|Sakshi

అగ్రిగోల్డ్‌ మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వ దారుణ వైఖరి 

మనోవ్యథతో చనిపోయింది 170 మంది బాధితులు

పోలీసులు నిర్ధారించింది 90 మంది 

ప్రభుత్వం పరిహారం ఇచ్చింది ఇద్దరికే

పరిహారానికి పోస్టుమార్టం నివేదికతో మెలిక

కాళ్లరిగేలా తిరుతున్న బాధిత కుటుంబాలు

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితుల్ని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రభుత్వ పెద్దల హామీలు ఆ సంస్థ చేసిన మోసంలాగే ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థలో  సొమ్ము తిరిగి వస్తుందని ఏళ్ల తరబడి ఎదురుచూసినా అది రాకపోవడంతో చాలా మంది మనోవ్యథకు గురై మృతి చెందుతున్న సంగతి తెల్సిందే. వారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు పరిహాసం చేస్తోందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. 

రాష్ట్రంలో 19.52 మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామంటూ చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. తమను ఆదుకోవాలంటూ మూడున్నరేళ్లుగా డిపాజిటర్లు, ఏజెంట్లు దశలవారీ ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనే తదితర అనేక డిమాండ్స్‌పై ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంటూ ఈ ఏడాది మార్చి 23న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం సెప్టెంబర్‌ నెలలో రూ. 5 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మూడు నెలలు గడిచినా బాధిత కుటుబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ పూర్తికాలేదు. 

ఎప్‌ఐఆర్, పోస్టుమార్టం మెలిక..
పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఐఆర్‌ ఉన్న వారికి పరిహారం ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 80 జారీ చేయడం వివాదాస్పమైంది. వాస్తవానికి కేవలం 11 మంది మృతులకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వెంటనే వివరాలను పోలీసులకు తెలియజేయకపోవడంతో చాలా మంది మృతులకు సంబంధించిన ఆ రిపోర్టులు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. దీనిపై బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు నిర్ధారించిన అనంతరం అందరికీ న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా సర్కారు హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం నివేదికలు కావాలంటూ అధికారులు మెలికపెడుతున్నారు.  నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో పరిహాసమే ఎదురవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పరిహారం ఇచ్చింది ఇద్దరికే..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 170 మంది అగ్రి బాధితులు మృతి చెందారు. వీరిలో 90 మందిని మాత్రమే పోలీసులు ధ్రువీకరించారు. వీరికి కూడా రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడంలేదు. విజయనగరం జిల్లాకు చెందిన కేవలం ఇద్దరికి మాత్రమే రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. బాధిత కుటుంబాల వారు పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.  

మరిన్ని వార్తలు