మద్యం షాక్‌ కొట్టింది!

6 May, 2020 04:10 IST|Sakshi

మద్యం ధరలు మరోసారి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

దశలవారీ మద్య నిషేధం దిశగా వడివడిగా అడుగులు

సాక్షి, అమరావతి: మద్యం ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో మద్యం రేట్లు మరోసారి భారీగా పెరిగాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరిచే విధంగా, మద్యం తాగేవారి సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో దేశీ, విదేశీ ధరలను 50 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం మద్యం షాపులను తెరిచే సమయానికి 25 శాతం రేట్లను పెంచగా, తాజాగా దీనికి అదనంగా మరో 50 శాతం రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా మొత్తం 75 శాతం వరకు ధరలను పెంచినట్లయింది. 

రెండో రోజు తగ్గిన రద్దీ..
► పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చే విధంగా రెండోరోజు షాపులను ఆలస్యంగా తెరిచారు. కొన్ని చోట్ల సాయంత్రం వరకు డిపోల నుంచి రేట్ల వివరాలు రాకపోవడంతో దుకాణాలను తెరవలేదు. 
► దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగానే ధరలను షాక్‌ కొట్టేలా పెంచారు. ధరల పెంపుతో మద్యం తాగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.  
► కేంద్రం మార్గదర్శకాల మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచారు. 
► రెండో రోజు పెంచిన ధరలతో అమ్మకాలు ప్రారంభించడంతో షాపుల వద్ద రద్దీ తగ్గింది. 180 ఎంఎల్‌ను ప్రామాణికంగా తీసుకుని రూ.120 ఎమ్మార్పీ, రూ.120 – రూ.150 వరకు, రూ.150కిపైగా ఎమ్మార్పీ ధరలపై 50 శాతం రేట్లను పెంచారు. 

మద్యం మాఫియా టీడీపీదే
మద్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే మద్యం షాపుల్ని తెరిచాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకుండా గగ్గోలు పెడుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో 50 నుంచి 70 శాతం వరకు ధరలు పెంచారు. మద్యపానాన్ని ప్రజలకు దూరం చేస్తామని చెప్పాం. మద్యం ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతామని సీఎం జగన్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. మద్యం వ్యసనం నుంచి దూరం చేసేందుకే ధరలు పెంచాం. ప్రజలకు మద్యాన్ని అలవాటు చేసిందే చంద్రబాబు. రాష్ట్రంలో మద్యం మాఫియా నడిపేదే టీడీపీ నేతలు. ఇందుకు అన్ని ఆధారాలు మావద్ద ఉన్నాయి. చంద్రబాబు బంధువులు చిత్తూరులో మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేసినప్పుడు సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్‌) అమ్మించిన ఘనుడు చంద్రబాబు.    
– నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం 

మరిన్ని వార్తలు