ఇంకా తాగిద్దాం!

15 Dec, 2017 04:08 IST|Sakshi

ఆదాయానికి అదే పరమావధి

రాష్ట్రంలో మరో 9 మద్యం డిపోలు ఏర్పాటుకు సిద్ధం

ఇప్పటికే 24 మద్యం డిపోల ద్వారా 

రూ. 11 వేల కోట్లు దాటిన అమ్మకాలు

రూ. 17 వేల కోట్ల అమ్మకాలు దాటేందుకు సర్కారు ద్విముఖ వ్యూహం

మొబైల్‌ బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూంలతో రాష్ట్రంలో ఫుల్లుగా అమ్మకాలు  

సాక్షి, అమరావతి:మద్యం ఆదాయం పెంచుకునేందుకు సర్కారు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. బెల్టు షాపులు, పర్మిట్‌ రూంల ద్వారా జనం చేత ఫుల్లుగా తాగిస్తున్న ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేసేందుకు అదనపు మద్యం డిపోలను ఏర్పాటు చేయనుంది. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును డిపోల్లో ఉంచేందుకు ఆగమేఘాల మీద రాష్ట్రంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 24 మద్యం డిపోలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో తొమ్మిది ఏర్పాటు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ. 13,640.22 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే(డిసెంబర్‌ 1నాటికి) మద్యం అమ్మకాలు రూ. 11 వేల కోట్లు దాటాయి. మార్చి నాటికి మద్యం అమ్మకాలు రూ. 17 వేల కోట్లు దాటాలని లక్ష్యం విధించిన సర్కారు అదనంగా మద్యం డిపోలను ఏర్పాటు చేసి మద్యం షాపులకు అమ్మకాల టార్గెట్లు విధించనుంది. దీనికి తోడు వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మద్యం డిపోల ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేస్తోందని పలువురు అధికారులు అంటున్నారు. తమకు అనుకూలంగా ఉండి, పదవీ విరమణ చేసిన ఓ అధికారికి డిపోల పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో సర్కారు వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కొత్త మద్యం డిపోలు ఏర్పాటు చేసే ప్రాంతాలివే.. 
మదనపల్లి(చిత్తూరు జిల్లా), అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కనగానపల్లి, ప్రొద్దుటూరు(వైఎస్సార్‌ జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), గూడూరు(నెల్లూరు జిల్లా), భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా), గాజువాక(విశాఖ జిల్లా), పలాస(శ్రీకాకుళం జిల్లా), బొబ్బిలి(విజయనగరం జిల్లా)లో మద్యం డిపోలు నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు రూ. 50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 15 డిస్టిలరీలున్నాయి. వీటి ద్వారా లైసెన్స్‌డ్‌ ఉత్పాదక సామర్ధ్యం 2,590 లక్షల ప్రూఫ్‌ లీటర్ల వరకు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి చీప్‌ లిక్కర్‌ టెట్రా ప్యాక్‌లు, బీర్ల కేసుల్ని భారీగానే దిగుమతి చేస్తున్నారు.  

ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం 
రాష్ట్రంలో మద్యం సిండికేట్లు ‘మొబైల్‌ బెల్టు షాపుల’ ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం బాటిళ్లను విక్రయిస్తూ కొత్త పంథా ఎంచుకున్నారు. ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం చేర్చే వ్యాపారం మూడు గ్లాసులు.. ఆరు పెగ్గులు అన్న రీతిలో సాగుతోంది. మద్యం షాపు నుంచి కొనుగోలు చేసే బాటిళ్లపై 13 అంకెల బార్‌ కోడ్‌తో హాలోగ్రామ్‌ లేబుల్‌ను తొలగించి అమ్మకాలు చేపడుతున్నారు. బ్యాచ్, హీల్‌ నంబర్లు లేకపోవడంతో మద్యం బాటిళ్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారన్నది తెలియడం లేదని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 4,380 మద్యం షాపులకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పర్మిట్‌ రూంలు మినీ బార్లులా కొనసాగుతున్నాయి. బెల్టు షాపులపై ఫిర్యాదులకు ప్రభుత్వం 1100 నంబరును ప్రకటించింది. అయితే అదంతా ప్రచారం కోసమేనని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. పలుచోట్ల పాన్‌ షాపులు, మెడికల్‌ షాపులు, జనరల్‌ స్టోర్స్‌లలో కూడా విక్రయాలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు