ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు?

8 Jul, 2018 07:21 IST|Sakshi

పార్లమెంట్‌ సమావేశాలప్పుడే అసెంబ్లీకి కూడా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు యోచన

బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు వీలుగానే..  

సాక్షి, అమరావతి : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెలలోనే పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు వీలుంటుందని భావిస్తోంది. దీనిపై ఈ నెల 12న జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ముఖ్యులతో చర్చలు జరిపారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెలలో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిపితే ఉపయోగం ఉంటుందని నాయకుల వద్ద సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.

15 నుంచి 18 రోజులు సమావేశాలు జరుపుదామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలుపై పార్లమెంటులో పార్టీ ఎంపీలతో హడావుడి చేయిస్తూ.. అదే సమయంలో అవే అంశాలపై అసెంబ్లీలో చర్చించడం ద్వారా విస్తృతంగా ప్రచారం లభిస్తుందని టీడీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని, ఏకపక్షంగా అన్ని విషయాలపైనా మాట్లాడవచ్చని, ఒకవైపు బీజేపీపై ఎదురుదాడి చేస్తూనే మరోవైపు వైఎస్సార్‌సీపీపైనా విమర్శలు చేయవచ్చని వారు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు