రూ. 576.62 కోట్ల రహస్య జీవో

7 Sep, 2017 13:55 IST|Sakshi
రూ. 576.62 కోట్ల రహస్య జీవో
♦ గ్రామీణాభివృద్ధి శాఖలో జారీ
♦ నంద్యాల ఉప ఎన్నికలో ఖర్చుచేసిన దానికేనని ఆరోపణలు
 
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రూ.576.62 కోట్ల విడుదలకు సంబంధించి మంగళవారం రహస్య జీవోను జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఈ జీవో జారీ అయింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం జారీ చేసిన జీవో నంబరు 608లో రూ.576.62 కోట్ల ప్రభుత్వ నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఆ నిధులు ఏ పనులు నిమిత్తం విడుదల చేశారనే వివరాలను పేర్కొనాల్సిన చోట ఖాళీగా ఉంచి అందులో ‘కాన్ఫిడెన్షియల్‌( రహస్యం)’ అని రాశారు. 
 
ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించిన జీవోగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడి నిధి పథకంలో డ్వాక్రా మహిళలకు మూడో విడతగా రూ.4 వేల చొప్పున నిధులను రాష్ట్రమంతటా విదుదల చేయాల్సి ఉండగా.. ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం నంద్యాల నియోజకవర్గంలోని వారికి మాత్రమే ప్రభుత్వం నిధులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులకు సంబంధించే ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
 
మరిన్ని వార్తలు