కచ్చులూరు హీరోలకు సర్కారు కానుక

28 Sep, 2019 04:27 IST|Sakshi

బోటు ప్రయాణికులను కాపాడిన ఒక్కొక్కరికి రూ.25వేలు

జిల్లా కలెక్టర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

వారు ఆ సాహసం చేయకుంటే మరణాలు పెరిగేవి

ప్రమాద ఘటనపై త్వరలో నివేదిక : మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం క్రైం : ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన గిరిజన మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసినట్లు వివరించారు. ఈ దుర్ఘటనపై శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కచ్చులూరు గ్రామస్తులు ఇంతటి సాహసానికి ఒడిగట్టకపోయి ఉంటే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. కష్టతరమైనప్పటికీ బోటును వెలికితీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే, ఈ తరహా ఘటనలు  పునరావృతం కాకుండా కమిటీ వేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. కాగా, ప్రమాదంలో గల్లంతైన ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. గాలింపు చర్యలు నేటికీ కొనసాగుతున్నాయని.. ఆచూకీ తెలియని వారి డెత్‌ సర్టిఫికెట్లను కుటుంబసభ్యులు అడుగుతున్నందున దానిని పరిశీలించి జీవో తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. 

ప్రమాదంపై త్వరలో నివేదిక
ఇదిలా ఉంటే.. రెండు మూడు వారాల్లో బోటు ప్రమాదంపై నివేదిక వస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. బోటును తీసే సామర్థ్యం ఉందని కొందరు ముందుకు వస్తున్నందున వారి ప్రతిపాదనలను పరిశీలించి అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎవరైనా బోటు తీస్తామని ముందుకు వస్తే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకు అస్పష్టమైన జీవో జారీచేశారని.. కానీ, స్పష్టమైన జీవోను తయారుచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా పాల్గొన్నారు. 

మరో మృతదేహం లభ్యం
కాగా, బోటు ప్రమాదానికి సంబంధించి శుక్రవారం మరో మృతదేహం లభించడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. కడియపులంక వద్ద గోదావరిలో లైఫ్‌ జాకెట్‌తో ఉన్న పురుషుడి మృతదేహాన్ని బురదలో గుర్తించారు.  మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మరోవైపు.. తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న కారుకూరి రమ్యశ్రీ (24) ఆచూకీ కోసం ఆమె సోదరుడు, బావ ఎదురుచూస్తుండగా, మరికొందరి కుటుంబ సభ్యులు కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద నిరీక్షిస్తున్నారు. డెత్‌ సర్టిఫికెట్లు ఇస్తే వెళ్లిపోతామని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు