తొలి రోజు పంపిణీ రూ. 954 కోట్లు

5 Apr, 2020 05:04 IST|Sakshi
విజయనగరంలో రూ.1,000 అందుకుంటున్న వృద్ధురాలు

రూ. 1000 చొప్పున నగదు పంపిణీ 

మిగిలిన కుటుంబాలకు ఆది, సోమవారాల్లో పంపిణీ 

బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి డబ్బులు అందేదాకా కొనసాగింపు

కార్డులో పేరు ఉన్న 18 ఏళ్ల పైబడిన వారు ఎవరో ఒకరు ఇంటిలో ఉంటేనే పంపిణీ

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలలో భాగంగా లాక్‌డౌన్‌ అమలుతో ఉపాధిని కోల్పోయిన పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ. 1000ల చొప్పున పంపిణీ చేసింది. రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబం వద్దకు వలంటీర్లే వెళ్లి డబ్బు పంపిణీ చేశారు. ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, రాత్రి సమయానికి 95,44,224  కుటుంబాలకు మొత్తం రూ. 954.42 కోట్లు పంపిణీ చేశారు. దాదాపు 71.74 శాతం కుటుంబాలకు తొలిరోజే పంపిణీ పూర్తయింది.   ప్రభుత్వం ఒక పక్క కోవిడ్‌–19 వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుంటూనే లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్విముఖ వ్యూహంతో చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ప్రతి బియ్యం కార్డుదారుకు రూ.1000ల చొప్పున అందజేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తెల్లరేషన్‌కార్డు ఉన్న 1.33 కోట్ల కుటుంబాలకు వెయ్యి చొప్పున పంపిణీకి మొత్తం రూ. 1330.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. శనివారం డబ్బులు పంపిణీ చేయని కుటుంబాలకు ఆది, సోమ వారాల్లో కూడా పంపిణీ జరుగుతుందని, కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి డబ్బులు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. 

► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 2,39,064 మంది వలంటీర్లు ఈ పంపిణీలో పాల్గొన్నారు. 
► వలంటీర్లు డబ్బును లబ్ధిదారుల చేతికే అందించే క్రమంలో  కరొనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ ను రూపొందించింది. దాని ద్వారా లబ్ధిదారుల నుంచి సంతకాలు, వేలి ముద్రలు వంటివి తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 
► పంపిణీలో అవకతవకలకు తావులేకుండా యాప్‌ను పూర్తి పారదర్శకంగా డిజైన్‌ చేశారు. 
► వలంటీర్లు డబ్బులు పంపిణీకి లబ్ధిదారుని ఇంటికి వెళ్లగానే ఆ కుటుంబానికి సంబంధించిన బియ్యం కార్డులో నమోదై ఉన్న పేర్ల వివరాలన్నీ వలంటీరు వద్ద ఉన్న మొబైల్‌ యాప్‌లో కనిపిస్తాయి. ఆ యాప్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం కార్డు నమోదైన కుటుంబ యజమాని లేదంటే ఆ కుటుంబంలో 18 ఏళ్లు పైబడిన వయస్సు ఉండే ఏ ఒక్కరు అందుబాటులో ఉన్నా యాప్‌కు అనుసంధానం అయి ఉండే కెమేరా ద్వారా అతని ఫొటో తీసుకొని డబ్బులు చెల్లించారు. 
► ఆ ఫొటో ఏ ప్రాంతంలో తీశారన్న వివరాలు  తెలిసేలా జియోట్యాగ్‌ అయి ఉంటుంది. అవసరమైతే రేషన్‌కార్డులో ఫొటోలను, వలంటీరు డబ్బులు పంపిణీ చేసిన వ్యక్తి ఫొటోలను అధికారులు సరిపోల్చుకోవడానికి అవకాశం ఉంది. 
► మధ్యాహ్నం ఒంటి గంట వరకు 32,00,114 మంది కార్డుదారులకు పంపిణీ పూర్తయింది. సాయంత్రానికి 95.44 లక్షల మందికి పంపిణీ జరిగింది. 
► ఆది, సోమ వారాల్లో కూడా పంపిణీ కొనసాగనుంది. అప్పటికీ ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా పంపిణీ చేస్తారు.

పెద్ద మనసు
ప్రత్యేక నగదు సాయం డబ్బులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 
కరోనా కట్టడి పోరాటంలో తమ వంతు బాధ్యతగా ప్రత్యేక సాయం డబ్బులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి ఇద్దరు వృద్ధులు మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం అనంతపురం అశోక్‌నగర్‌ 39వ సచివాలయం వద్ద రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందుకున్న లక్ష్మీదేవి, గోవిందమ్మలు ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి అందజేశారు.వారి సహృదయాన్ని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి, గోవిందమ్మలు మాట్లాడుతూ.. కరోనా సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా రేషన్, కందిపప్పు అందజేసిందన్నారు. స్థానిక నాయకులు సైతం ఇంటింటికీ నిత్యావసర సరుకులు ఇచ్చారని చెప్పారు. 

గతంలో ఎవరూ ఆదుకోలేదు.. 
‘ఈమె పేరు సిద్ధిరెడ్డి వెంకటమ్మ. దివ్యాంగురాలు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన గిరిజన కుటుంబం. ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల పింఛన్‌తో పాటు చేపల విక్రయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల ఎటూ వెళ్లలేక కుంగిపోయింది. ఇలాంటి సమయంలో పింఛన్‌ సొమ్ముతో పాటు ప్రత్యేక సాయం కింద ప్రభుత్వం ప్రకటించిన డబ్బులు ఆమెకు అందాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదని, ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల కష్టాలను గుర్తించారని సంతోషం వ్యక్తం చేసింది.

మళ్లీ ఆదుకున్నారు.. 
‘తిండిగింజలు కూడా దొరకని కçష్టకాలంలో కందిపప్పుతోపాటు రేషన్‌ బియ్యం ఉచితంగా ఇచ్చారు. 1నే పింఛన్‌ ఇచ్చారు. మళ్లీ ఇవాళ రూ.1,000 ఆర్థిక సాయం వలంటీర్ల ద్వారా ఇంటికి పంపించారు. రోజులు ఎలా గడుస్తాయో అని ఆందోళన చెందుతున్న మాకు ప్రభుత్వం అండగా నిలవడం చాలా ఆనందంగా ఉంది’ 
– కొనకళ్ల లలితాంబ, మచిలీపట్నం

మా బాధలను గుర్తించారు.. 
‘ఈ ఫోటోలో కనిపిస్తున్న మల్లీశ్వరి గుంటూరులో ఓ హోటల్‌లో పనిచేస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల వారం రోజులకు పైగా మూతబడింది. వేరే పనికి కూడా వెళ్లేందుకు వీలులేని పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంటి వద్దకే ఆర్థిక సాయం పంపడం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని కృతజ్ఞతలు తెలిపింది. 

సరుకులన్నీ తెచ్చుకుంటా.. 
 ‘రోజూ కూలీ పనులకు వెళితేగాని పూట గడవని పరిస్ధితి. 15 రోజులుగా పనులు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేక సరుకులు కోసం ఇబ్బంది పడ్డాం. ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న తరుణంలో దేవుడిలా ముఖ్యమంత్రి జగన్‌ సాయం పంపించారు. రూ. వెయ్యితో ఇంటికి అవపరమైన సరకులన్నీ తెచ్చుకున్నా’ 
– తిరుమాని నాగమణి, భీమవరం 

నాలుగు రోజుల్లో రెండుసార్లు చేయూత... 
‘నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చారు. ఇప్పుడు మరో రూ.వెయ్యి సాయం అందించారు. వెఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదలకు అడగకుండానే వరాలు ఇస్తు్తన్నారు’ 
– పందిరి నరసయ్యమ్మ, ఒంటరి మహిళ, తగరపువలస

నూనె, కారం, దినుసులు తెచ్చుకుంటాం... 
‘మాది  కడప దగ్గరలోని రామాంజనేయపురం. కూలీ పనులు లేవు. ప్రభుత్వం మాలాంటి వారికి బియ్యంతోపాటు రూ.1000 డబ్బులు కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో నూనె, కారం, పప్పుదినుసులు తెచ్చుకుంటాం’  
– రామసుబ్బమ్మ, వైఎస్సార్‌ జిల్లా

పేదలకు కొండంత అండ 
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హులికల్లుకు చెందిన కుళ్లాయమ్మ భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 1న పించన్‌ అందడం, ఇప్పుడు రూ.వెయ్యి ప్రత్యేక సాయం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌ పేదలకు కొండంత అండగా నిలిచారని పేర్కొంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా