పేకాట, మద్యంపై ఉక్కుపాదం

15 Jan, 2020 04:08 IST|Sakshi
కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాల వద్ద మంగళవారం రాత్రి విద్యుత్‌ కాంతుల మధ్య జరుగుతున్న కోడి పందేలు

బరుల వద్ద విస్తృతంగా గస్తీ

ఆదేశాలు ఉల్లంఘిస్తే సస్పెన్షనే అంటూ హెచ్చరిక.. వైర్‌లెస్‌ మెసేజ్‌ ఇచ్చిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు 

ఆలస్యంగా ఎగిరిన పందెం కోళ్లు.. అదీ అరకొరగానే.. 

పోలీస్‌ ఆంక్షలతో తొలి రోజున ఉత్కంఠ 

కోడి పందేల చరిత్రలో ఈ పరిస్థితి ఇదే తొలిసారి 

లాడ్జిలకే పరిమితమైన పందెం రాయుళ్లు

సాక్షి, అమరావతి: ఈ ఏడాది కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గతంలో కోడిపందేల బరుల వద్దే అనధికారంగా ఏర్పాటుచేసే షాపుల్లో మద్యం ఏరులై పారేది. దీంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి కూడా పెద్దఎత్తున సాగేవి. కానీ, గతానికి కన్నా భిన్నంగా ఈ ఏడాది పందేలు జరిగే ప్రతిచోటా మద్యం అమ్మకాలు, జూదం నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వైర్‌లెస్‌ మెసేజ్‌లు పంపించారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ సోమవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వైర్‌లెస్‌ కాన్ఫరెన్స్‌లోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరి ప్రాంతంలోనైనా మద్యం అమ్మకాలు, పేకాటలు జరిగితే అక్కడి పోలీసులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. 

పంతం నెగ్గించుకున్న పోలీసులు 
కోడి పందేల చరిత్రలో తొలిసారిగా పోలీసులు భోగి రోజున ఒక పూట అయినా వాటిని అడ్డుకుని రికార్డు సృష్టించారు. ఏటా పోలీసులు హడావుడి చేయడం.. చివరికి భోగి రోజు ఉదయమే పందేలు మొదలు కావడం ఎప్పుడూ జరిగే తంతే. అయితే, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కొంతమేర వాటిని నిలువరించగలిగారు. భీమవరం, ఎదుర్లంక, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత పందేలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. కోడి పందేలు, పేకాట కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అతిథులు పోలీసు ఆంక్షల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు భీమవరం, తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమయ్యారు.  
ఆలస్యంగా.. అరకొరగా కోడిపందేలు 
మరోవైపు.. పోలీసు ఆంక్షల నడుమ తొలిరోజున పందెం కోళ్లు ఆలస్యంగా ఎగిరాయి. కోడి పందేలు జరుగుతాయో లేదోనని భోగి రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే.. పందేలను అడ్డుకుంటామంటూ పోలీసులు బరుల వద్ద పికెట్‌లు ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కోడి పందేల నిర్వాహకులు, కత్తులు కట్టే వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఇది ఎప్పుడూ ఉండే తంతే అనుకున్న నిర్వాహకులు చివరకు భోగి రోజున కోడి పందేలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆయా బరుల వద్ద పికెట్‌ నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బరుల వద్ద పందేలు ప్రారంభించుకోవడానికి నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పలేదు. అనుమతి కోసం వారు పడిగాపులు కాసారు. చివరికి మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఒంటి గంట నుంచి మూడు గంటలలోపు అరకొరగానే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి రోజు పందేల రాయుళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. 

మరిన్ని వార్తలు