బత్తాయి రైతుకు సర్కారు అండ

22 Apr, 2020 03:26 IST|Sakshi

టన్ను రూ.14 వేలకు కొనుగోలు చేస్తున్న మార్కెటింగ్‌ శాఖ 

తొలి విడతలో రైతుల నుంచి 120 టన్నుల కొనుగోళ్లు 

నేటి నుంచి రైతుబజార్లలో కిలో రూ.20 చొప్పున విక్రయాలు

సాక్షి, అమరావతి: కొవిడ్‌–19 కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో ఎగుమతుల్లేక రాష్ట్రంలో చీనీ (బత్తాయి) ధర పతనమైంది. దీంతో ఆ రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పంటకు మంచి ధర వచ్చే వరకు రైతుల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో విక్రయించాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని రైతుల నుంచి టన్ను రూ.14 వేల చొప్పున తొలి విడతగా 120 మెట్రిక్‌ టన్నులను సోమ, మంగళవారాల్లో కొనుగోలు చేసింది. వీటిని లారీల ద్వారా రాష్ట్రంలోని వివిధ రైతుబజార్లకు పంపించింది.

రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు, స్వయం సహాయక గ్రూపుల కమీషన్లతో కలిపి రైతుబజార్లలో కిలో రూ.20 లకు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, కొనుగోలు చేసిన బత్తాయిని శ్రీకాకుళం జిల్లాకు 5 టన్నులు, విజయనగరం 10, విశాఖ సిటీ 10, విశాఖ జిల్లా 20, తూర్పుగోదావరి 10, పశ్చిమ గోదావరి 10, విజయవాడ 10, కృష్ణాజిల్లా 15, గుంటూరు 10, ప్రకాశం 5, నెల్లూరు 5, చిత్తూరు 5, కర్నూలు జిల్లాకు 5 టన్నుల చొప్పున కేటాయించారు. ఇక విజయవాడ, విశాఖ రైతుబజార్లలో బుధవారం నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. మిగిలిన రైతుబజార్లలో ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి.

ఎగుమతులు మొదలయ్యే వరకూ కొనుగోళ్లు
ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అక్కడి వ్యాపారులు బత్తాయి కొనుగోలుకు రాష్ట్రానికి వస్తే టన్ను రూ.20వేలకు పైగానే పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఆ ధర వచ్చే వరకు రైతుల నుంచి బత్తాయిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ ఇస్సార్‌ అహ్మద్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు