కుబ్రాకు అండగా ఏపీ సర్కారు 

26 Nov, 2019 03:28 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుబ్రా

ఖర్చు మొత్తం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పైనుంచి కారు దూసుకొచ్చిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కుబ్రా బేగంకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెయింటర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ అజీమ్‌ తన కుమార్తె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు చెల్లించే స్తోమత లేక కేర్‌ ఆస్పత్రి ఆవరణలో దీనంగా ఉండటంపై ‘రూపాయి లేదు.. వైద్యమెలా’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం సంచికలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. కుబ్రా పూర్తిగా కోలుకునేంత వరకు చికిత్స చేయించాలని అధికారులను ఆదేశించారు.

అందుకయ్యే ఖర్చులను పూర్తిగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి భరించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు కేర్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. దీంతో కుబ్రాకు సోమవారం ఉదయం నుంచే పూర్తిస్థాయి వైద్యసేవలు అందటంతో ఆమె తండ్రి అబ్దుల్‌ అజీమ్, కుటుంబ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ జి.దేవేంద్రరెడ్డి తెలిపారు. ఆస్పత్రికి వెళ్లి కుబ్రా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు