4 రోజులు 20 వేల ప్రాంతాలు

4 Apr, 2020 04:06 IST|Sakshi

కరోనా కట్టడికి గ్రామాల్లోనూ ముమ్మర చర్యలు 

నిత్యం 6 వేల చోట్ల సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారీ

ద్రావణాన్ని నిల్వ చేసుకోవాలని ఆదేశించిన పంచాయతీరాజ్‌ శాఖ  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ ముమ్మర చర్యలు చేపట్టింది. గ్రామాల్లోని 6 వేల ప్రాంతాల్లో నిత్యం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా దాదాపు 20 వేల ప్రాంతాల్లో ఈ ద్రావణాన్ని స్ప్రే చేయించారు.

కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షణ
► పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ వి.రంగా నేతృత్వంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.
► రాష్ట్ర వ్యాప్తంగా 13,378 గ్రామ పంచాయతీల పరిధిలో నిత్యం చేపడుతున్న కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలను సీసీసీ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 
► సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసిన చోట అంటువ్యాధులు ప్రబలే అవకాశం తక్కువ. ఈ దృష్ట్యా పంచాయతీరాజ్‌ శాఖ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ద్రావణం పిచికారీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
► లీటరు సోడియం హైపో క్లోరైడ్‌ను 40 లీటర్ల నీటిలో కలిపి కరోనా పాజిటివ్‌ కేసులు, అనుమానిత ప్రాంతాల్లో పిచికారీ చేయిస్తున్నారు.
► శుక్రవారం కూడా 5,674 గ్రామీణ ప్రాంతాల్లో దీనిని పిచికారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఈ ద్రావణాన్ని అవసరమైన పరిమాణంలో నిల్వ చేసుకోవాలని జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు సూచనలు వెళ్లాయి.
► వేరే ప్రాంతంలో నివాసం ఉంటూ ఏదైనా పని మీద ఇతర గ్రామాలకు వచ్చే వారిని వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
► ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. 
► అనుమానితులుగా తేలితే అలాంటి వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా సీసీసీ పర్యవేక్షిస్తోంది. 

మరిన్ని వార్తలు