రేట్లు పెంచితే శిక్ష

30 Mar, 2020 02:40 IST|Sakshi
కరోనా కట్టడిపై ఆదివారం జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఇక మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు

ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా అందులోనే

రైతులు, రైతు కూలీలు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం వరకు పొలం పనులకు అనుమతి

సామాజిక దూరం పాటించడం తప్పనిసరి 

పక్కాగా వలంటీర్ల సర్వే..ప్రతి కుటుంబం వివరాలు నమోదు 

కోవిడ్‌ విస్తరిస్తున్న పట్టణాలపై ప్రత్యేక దృష్టి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) విస్తరించకుండా మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. పొలం పనుల సీజన్‌ నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ వారిని మధ్యాహ్నం వరకు పనులకు అనుమతించాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ విస్తరణ నివారణ చర్యలతోపాటు నిత్యావసరాలు, పేదలకు రేషన్‌ పంపిణీ, ఆక్వా, పంటలకు గిట్టుబాటు ధరలు, వలస కూలీలు, కార్మికులకు వసతి, భోజన సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాధ్, మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇందులో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.  

మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు
► వలస కూలీలు, కార్మికులకు షెల్టర్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలి. సరుకు రవాణా, అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకూడదు.
► జిల్లాల్లో మంత్రి ఆధ్వర్యంలో కోవిడ్‌ నివారణ చర్యలు చేపట్టాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారులు సమావేశాలు నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలి.

పట్టణాలపై ప్రత్యేక దృష్టి: డీజీపీ
► ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు డీజీపీ సవాంగ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 

పొలం పనులకు ఇబ్బంది రాకూడదు
► సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ, ఆక్వా రంగ కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామాల్లో రైతులు, కూలీలు పనులు కొనసాగించుకునేందుకు  అనుమతించాలి. ఆక్వా ఎగుమతులు పునఃప్రారంభించేందుకు చర్యలు. ఆక్వా కంపెనీల్లో పనిచేసే సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు సమకూర్చేందుకు యజమానుల అంగీకారం. 
► జిల్లాల వారీగా నోడల్‌ అధికారులను నియమించి రైతుల నుంచి అందే ఫిర్యాదులపై పరిశీలన. గ్రామ సచివాలయాల్లోని ఆక్వా అసిస్టెంట్లు ఇందులో భాగస్వామ్యం కావాలని సీఎం ఆదేశం.
► వ్యవసాయానికి అవసరమైన ఎరువుల రవాణా నిలిచిపోకుండా చర్యలు. ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల సరఫరా ఆగకుండా ఏర్పాట్లు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఎక్కడికక్కడ నిల్వ ఉండేలా చర్యలు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తగ్గకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. కనీస గిట్టుబాటు ధరలు తప్పనిసరిగా లభించేలా చూడాలని సీఎం ఆదేశం.
మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

నిత్యావసరాల ధరలపై విస్తృత ప్రచారం..
► ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరించకుండా ప్రణాళిక రూపొందించాలి.
► వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ప్రతి  ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబాల వివరాలను నమోదు చేసేలా చూడాలి.
► అన్నిచోట్లా రైతుబజార్లు, నిత్యావసర దుకాణాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
► పట్టణ ప్రాంతాల్లో రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతిస్తారు. మిగిలిన చోట్ల ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతిస్తారు.
► ఎక్కడైనా నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిని విక్రయించే దుకాణాల దగ్గర ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలి. అంతకు మించి అధిక ధరలకు అమ్మితే ప్రజలు ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా దుకాణదారులు అదే పట్టికలో అందరికీ కనిపించేలా పొందుపరచాల్సి ఉంటుంది.
► నిత్యావసర వస్తువుల ధరలను టీవీలు, పత్రికల్లో జిల్లాలవారీగా ప్రకటించి విస్తృత ప్రచారం కల్పించాలి.
► ప్రతి సూపర్‌మార్కెట్, దుకాణాల వద్ద ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలి. దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు అధిక ఆర్జన కోసం ప్రయత్నించడం దారుణం. 
► రేషన్‌ దుకాణాల వద్ద ఒకే లైను కాకుండా సామాజిక దూరం పాటించేలా మూడుకు మించి వరుసల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
► సంచార వాహనాల ద్వారా కూరగాయలు, నిత్యావసరాలు విక్రయించడాన్ని ప్రోత్సహించాలి. ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యావసరాల పంపిణీపై పరిశీలించాలని ఆదేశం.
► వృద్ధులు నివసించే ఓల్డేజ్‌ హోంలకు కావాల్సిన వాటిని అందించాలి. 
► లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్లో తక్కువగా లభ్యమవుతున్న నిత్యావసర వస్తువులను గుర్తించి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి.

పల్లెలపై ప్రత్యేక దృష్టి
ఇప్పటి దాకా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్న కరోనా వైరస్‌.. గ్రామాల్లోకి విస్తరించకుండా పంచాయతీరాజ్‌శాఖ ముందస్తుగా మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది ఆదివారం పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై దీనిపై ఓ కార్యాచరణను రూపొందించారు. అదేంటంటే.. 

► గ్రామ వలంటీర్లు తమకు కేటాయించిన 50 ఇళ్లను సోమవారం నుంచి ప్రతిరోజూ సందర్శించి, ఆయా కుటుంబ సభ్యుల ఆరోగ్యస్థితి, నిత్యావసర వస్తువుల అవసరం, ఆ కుటుంబాల నివాసిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల వివరాలను గ్రామ సచివాలయ సిబ్బందికి తెలియజేయాలి.
► గ్రామ సచివాలయాలవారీగా సేకరించిన వివరాలను జిల్లాలవారీగా నివేదికల రూపంలో సమీక్షించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో జిల్లాకో ప్రత్యేకాధికారిని నియమించారు. 
► దీంతోపాటు కమిషన్‌ కార్యాలయంలో నాలుగు విభాగాలతో ప్రత్యేక కమిటీలను నియమించారు. 
► జిల్లాలవారీగా నియమించిన ప్రత్యేకాధికారుల ద్వారా అన్ని జిల్లాల నుంచి సేకరించిన వివరాలతో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ప్రతి రోజూ సాయంత్రం 4.30 కల్లా నివేదిక తయారుచేసి దానిని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొవిడ్‌–19 నియంత్రణ కోఆర్డినేషన్‌ సెల్‌కు అందిస్తారు. 

మరిన్ని వార్తలు