వేతన యాతన!

24 Jun, 2018 03:48 IST|Sakshi

      కొత్త పీఆర్సీపై సర్కారు కాలయాపన.. ఈ నెలాఖరుతో ముగియనున్న పదో పీఆర్సీ

     11వ పీఆర్సీపై ఉత్తర్వులతోనే సరి 

     చైర్మన్‌ను నియమించకుండా కమిషన్‌తో ఒరిగేదేముంది?

     ఇప్పటికే పెండింగ్‌లో రెండు డీఏలు 

     ఉద్యోగులపై ప్రేమ అంటే ఇదేనా?

     మండిపడుతున్న ప్రభుత్వోద్యోగులు 

     3 నెలల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఆదేశించిన తెలంగాణ సర్కారు

     ఉద్యోగులకు ప్రభుత్వ బకాయి 4,600 కోట్ల రూపాయలు

సాక్షి, అమరావతి: ఒకవైపు పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. జూలై 1వతేదీ నుంచి కొత్త (11వ) పీఆర్సీ అమల్లోకి రావాలి. వచ్చే నెల నుంచి సవరించిన వేతనాలు దీని ప్రకారం అమలు కావాలి. ఇందుకు సరిగ్గా వారమే గడువు మిగిలినా రాష్ట్ర ప్రభుత్వం తాపీగా వ్యవహరిస్తూ చైర్మన్‌ను నియమించకుండా నూతన పీఆర్సీపై కేవలం ఉత్తర్వుల జారీతోనే సరిపెట్టడం గమనార్హం.

ఉత్తర్వులిచ్చి నెలైనా చైర్మన్‌ ఏరి?
రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీన 11వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 72 జారీ చేసింది. కమిషన్‌ ఛైర్మన్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏడాదిలోగా ఉద్యోగ సంఘాల నేతలు, విభాగాధిపతులు, ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులతో చర్చించి సమగ్రమైన సిఫార్సులతో ప్రభుత్వానికి అందజేయాలని జీవోలో పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు ఇచ్చి నెల దాటినా ఇప్పటి వరకూ పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పీఆర్సీ చైర్మన్‌ను నియమించటంతోపాటు రికార్డు సమయంలో 3 నెలల్లోగా నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించటం గమనార్హం. 

చైర్మన్‌ లేరంటే... ఉన్నా లేనట్లే!
‘వాస్తవంగా వేతన సవరణ కమిషన్‌ అంటే ఛైర్మనే. ఆయన్ను నియమిస్తేనే గత పీఆర్సీ నివేదికపై అధ్యయనం, ఉద్యోగ సంఘాలు, అధికారులతో సంప్రదింపులు లాంటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అసలు ఛైర్మన్నే నియమించలేదంటే 11వ వేతన సవరణ కమిషన్‌ ఉన్నా లేనట్లే’ అని ఓ  ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 

మరో ఏడాది ఎదురు చూపులేనా?
‘గడువు ముగియకముందే పీఆర్సీని నియమించి సకాలంలో నివేదిక తెప్పించుకుని కొత్త వేతనాలు అమలు చేయాలి. చంద్రబాబు సర్కారు ఇందుకు భిన్నంగా గడువు ముగుస్తున్నా పీఆర్సీ ఛైర్మన్‌నే నియమించలేదు. పైగా జీవోలో ఏడాదిలోగా సిఫార్సులు సమర్పించాలని పేర్కొంది. అంటే కొత్త పీఆర్సీ కోసం మరో ఏడాదిపైగా ఎదురు చూడాల్సిందేనా?’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

రూ. 5,000 కోట్ల బకాయిల ఎగవేత
పదో పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.5,000 కోట్ల వేతన బకాయిలను చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టింది. ఇది చాలదన్నట్లు మిగిలిన రూ.4,600 కోట్ల వేతన బకాయిలను విడుదల చేయకుండా నాన్చుతోంది. బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు డిమాండ్‌ చేయటంతో సమావేశాలు అంటూ కాలయాపన చేస్తోందే కానీ నయాపైసా కూడా విదల్చలేదు. 

ఇదేనా ఉద్యోగుల సంక్షేమం?
‘నాలుగేళ్లు సర్కారు ఏం చేసింది? అసలు మా వేతన బకాయిలు ఇవ్వాలని ఉందా.. లేదా? మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఏం చేసినట్లు? ఉద్యోగుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటల పరమార్థం ఇదేనా?’ అంటూ ఉద్యోగులు, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కరువు భత్యమూ కరువేనా?
ఉద్యోగులకు ఇప్పటికే రెండు కరువు భత్యాలు (డీఏ) పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి డీఏలను పెండింగ్‌లో పెట్టారు. 2017 జూలై ఒకటో తేదీ నుంచి ఒకటి, ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మరొక డీఏ పెండింగ్‌లో ఉంది. ఈ రెండు డీఏలను బకాయిలతో సహా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇక జూలై 1వ తేదీనుంచి ఉద్యోగులకు మూడో డీఏ వర్తింప జేయాల్సి ఉంది.  మరోవైపు పెన్షనర్లకు కూడా కరువు భృతి రిలీఫ్‌ (డీఆర్‌)లు రెండు పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణమే రెండు డీఆర్‌ బకాయిలను విడుదల చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు.

తక్షణమే ఛైర్మన్‌ను నియమించాలి
‘తక్షణమే పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించాలి. అన్ని అంశాలూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున గతంలో మాదిరిగా పీఆర్సీ సిఫార్సుల సమర్పణకు ఎక్కువ సమయం తీసుకోకుండా తెలంగాణ తరహాలో మూడు నెలల్లో నివేదికకు ఆదేశించాలి. ప్రభుత్వం దాన్ని తక్షణమే పరిశీలించి రికార్డు సమయంలో 11వ పీఆర్సీని అమలు చేయాలి’ 
– బొప్పరాజు వెంకటేశ్వర్లు (అమరావతి జేఏసీ ఛైర్మన్‌).

ఫిట్‌మెంట్‌పైనా ఫిట్టింగ్‌
నిబంధనల ప్రకారం పదో పీఆర్సీ 2013 జూలై 1 నుంచి అమల్లోకి రావాలి. అంటే ఆ రోజు నుంచి పదో పీఆర్సీ ప్రకారం అంతకు ముందు ఉన్న వేతనంపై 43% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. అయితే టీడీపీ సర్కారు 2014 జూన్‌ 2 నుంచే పదో పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించింది. ఫలితంగా 2013 జూలై 1 నుంచి 2014 జూన్‌ 1 వరకూ 11 నెలల పాటు ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన రూ.5,000 కోట్లకు పైగా పదో పీఆర్సీ బకాయిలకు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. పోనీ 2014 జూన్‌ 1 నుంచి అయినా పదో పీఆర్సీని సక్రమంగా అమలు చేసిందా అంటే అదీ లేదు. పదో పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను 2015 ఏప్రిల్‌ నుంచి చెల్లించింది. 2014 జూన్‌  2 నుంచి 2015 మార్చి 31 వరకూ అంటే పది నెలల పాటు ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదు.

మరిన్ని వార్తలు